Dinesh Panyam: అధిక వడ్డీ ఆశ చూపి రూ.20 కోట్లకు టోకరా.. హైదరాబాద్‌లో ఘరానా మోసం!

Hyderabad man Dinesh Panyam absconds with 20 crore in fraud
  • అధిక వడ్డీ ఆశ చూపి 170 మంది నుంచి డబ్బు వసూలు
  • షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో నమ్మించిన నిందితుడు
  • వడ్డీ ఆగిపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు
  • భర్తపై ఫిర్యాదు అందగానే విడాకులకు దరఖాస్తు చేసిన భార్య
  • ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితుల ఆవేదన
అధిక వడ్డీ ఆశ చూపి పలువురిని నమ్మించి సుమారు రూ.20 కోట్లతో ఓ వ్యక్తి పరారైన ఘటన హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో ఎక్కువ మంది విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన దినేశ్ పాణ్యం స్థానికంగా ఓ కార్యాలయం ఏర్పాటు చేశాడు. తాను షేర్ మార్కెట్లో నిపుణుడినని, పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సంపాదిస్తానని పరిచయస్థులను నమ్మించాడు. తన వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ మొత్తంలో ప్రతినెలా చెల్లిస్తానని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన పలువురు విశ్రాంత ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వృద్ధులు తమ వద్ద ఉన్న డబ్బును లక్షల్లో అతడికి అప్పగించారు.

నమ్మకం కుదిరేందుకు దినేశ్ పాణ్యం కొన్నాళ్లపాటు చెప్పినట్టుగానే ప్రతినెలా వడ్డీ డబ్బును బాధితుల ఖాతాల్లో జమ చేశాడు. దీంతో అతడిపై పూర్తి విశ్వాసం పెంచుకున్న మరికొందరు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇలా దాదాపు 170 మంది నుంచి రూ. 20 కోట్ల వరకు వసూలు చేశాడు. అయితే, గత కొన్ని నెలలుగా వడ్డీ చెల్లింపులు ఆగిపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు.

దీంతో వారంతా ఏకమై జూన్ 2న కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన రెండ్రోజులకే నిందితుడు దినేశ్ పాణ్యం భార్య కవిత పాణ్యం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం గమనార్హం. ఆమెను సంప్రదించగా తన భర్తతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నట్లు బాధితులు తెలిపారు. తాము ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేసి, డబ్బును తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Dinesh Panyam
Hyderabad
fraud
investment fraud
cyber crime
financial fraud
Malkajgiri
Kushaiguda police
high interest rates
retired employees

More Telugu News