బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై దుండగుల ఫైరింగ్... 30 రౌండ్ల కాల్పులు
- గురుగ్రామ్‌లోని నివాసం వద్ద ఈ తెల్లవారుజామున ఘటన
- బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల ఫైరింగ్
- దాదాపు 25 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు
- ఘటన సమయంలో ఇంట్లో లేని ఎల్విష్ యాదవ్
- రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ పరిశీలన
కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ (27) పని నిమిత్తం హర్యానా బయట ఉన్నట్లు తెలిసింది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటి కేర్‌టేకర్ మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఈ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో ఎల్విష్ కుటుంబం నివాసం ఉంటోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే గురుగ్రామ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
సెక్టార్-56 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.