ఆదిలాబాద్‌లో చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన కారు!
- ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు, రహదారులు
- కోజా కాలనీలో వరద నీటిలో కారు నడిపిన వ్యక్తి
- ఉద్ధృతికి ముందుకు కదలని వాహనం
- డ్రైవర్ కిందకు దిగడంతో తప్పిన ప్రమాదం
- చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయిన కారు
గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తూ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో, కోజా కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కారులో బయటకు వచ్చాడు. కాలనీలోని రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, దాన్ని దాటేందుకు ప్రయత్నించాడు.
కొంత దూరం వెళ్లాక వరద ప్రవాహం తీవ్రం కావడంతో కారు ముందుకు కదలలేక నీటిలోనే నిలిచిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన ఆ వ్యక్తి, వెంటనే అప్రమత్తమై కారు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. అతను బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే, వరద ఉద్ధృ తికి కారు కాస్తా కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.