Kangana Ranaut: సహజీవనం, డేటింగ్ యాప్స్ పై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Kangana Ranaut Sensational Comments on Live in Relationships and Dating Apps
  • సహజీవనం మహిళలకు సురక్షితం కాదన్న కంగన
  • డేటింగ్ యాప్స్ ను మురికి కాలువలతో పోల్చిన వైనం
  • సమాజం మహిళలనే తప్పుబడుతుందని వ్యాఖ్య
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయిన పురుషులతో సంబంధాల విషయంలో సమాజం ఎప్పుడూ మహిళలనే దోషిగా చూస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన వ్యక్తిగత జీవితంపై వచ్చే విమర్శలతో పాటు, నేటితరం డేటింగ్ పోకడలపై కూడా ఘాటుగా స్పందించారు.

కెరీర్‌లో రాణించాలనే తపన ఉన్న యువతులను పెళ్లయి, పిల్లలున్న పురుషులు తమవైపు ఆకర్షించుకోవాలని ప్రయత్నించినప్పుడు.. సమాజం మొత్తం ఆ అమ్మాయినే వేలెత్తి చూపుతుందని కంగనా అన్నారు. ఇలాంటి సందర్భాల్లో పురుషుడి తప్పును ఎవరూ చూడరని, కేవలం మహిళనే నిందిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. "ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలతో పెళ్లయిన వ్యక్తి సంబంధం పెట్టుకోవాలని చూస్తే, అది అతని తప్పు కాదా? కానీ నింద మాత్రం అమ్మాయి మీదే వేస్తారు" అని ఆమె పేర్కొన్నారు.

అదేవిధంగా, ఆధునిక డేటింగ్ యాప్‌ల వాడకంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని "సమాజంలోని మురికి కాలువలు"గా అభివర్ణించారు. ఆత్మవిశ్వాసం కొరవడిన వారు, ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడే వారే ఇలాంటి యాప్‌లను ఆశ్రయిస్తారని ఆమె విమర్శించారు. యువత తమ జీవిత భాగస్వాములను చదువుకునే రోజుల్లో గానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల ద్వారా గానీ ఎంచుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు మహిళలకు ఏమాత్రం సురక్షితం కావని కంగనా స్పష్టం చేశారు. ఇలాంటి సహజీవనంలో అమ్మాయి గర్భం దాల్చితే కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభించదని, దీనివల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. మొత్తంగా ఆధునిక సంబంధాల కన్నా సంప్రదాయ పద్ధతులే శ్రేయస్కరమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. 
Kangana Ranaut
Kangana Ranaut comments
live-in relationships
dating apps
bollywood actress
marriage
relationships
cheating husbands
women safety

More Telugu News