FASTag Annual Pass: ఫాస్టాగ్ వార్షిక‌ పాస్‌కు అనూహ్య స్పందన.. తొలిరోజే లక్షల లావాదేవీలు

FASTag annual pass on Day 1 with 139 lakh transactions
  • దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ సదుపాయం ప్రారంభం
  • తొలి రోజే వాహనదారుల నుంచి విశేష స్పందన
  • ఒక్కరోజే 1.4 లక్షల మంది వార్షిక‌ పాస్‌ల కొనుగోలు
  • ఏడాదికి రూ. 3000 చెల్లిస్తే చాలు, పదేపదే రీఛార్జ్ అవసరం లేదు
  • దేశవ్యాప్తంగా 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ సదుపాయం అమలు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫాస్టాగ్ యాన్యువల్ పాస్' సదుపాయానికి అద్భుతమైన స్పందన లభించింది. నిన్న‌ ప్రారంభమైన ఈ పథకానికి తొలి రోజే ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని, లక్షలాది మంది ఈ పాస్‌ను కొనుగోలు చేశారని నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) వెల్లడించింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సదుపాయం అమల్లోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7 గంటల వరకు సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ వార్షిక‌ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అదే సమయంలో టోల్ ప్లాజాల వద్ద సుమారు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఏడాది పాటు టోల్ టెన్షన్ లేదు
కేవలం రూ. 3,000 ఒకేసారి చెల్లించడం ద్వారా వాహనదారులు ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల వరకు ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల పదేపదే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తించే ఈ పాస్‌ను 'రాజమార్గయాత్ర యాప్' లేదా ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పాస్ కొనుగోలు చేసిన రెండు గంటల్లోనే ఇది యాక్టివేట్ అవుతుంది.

వినియోగదారులకు పూర్తిస్థాయి మద్దతు
ఈ పాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ప్రయాణికుల సందేహాలను నివృత్తి చేసేందుకు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు 1033 జాతీయ రహదారుల హెల్ప్‌లైన్‌ను మరింత బలోపేతం చేశామని, అదనంగా 100 మందికి పైగా సిబ్బందిని చేర్చామని అధికారులు వివరించారు. 

ప్రస్తుతం దేశంలో ఫాస్టాగ్ వినియోగం సుమారు 98 శాతానికి చేరిందని, 8 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కొత్త వార్షిక‌ పాస్ సదుపాయంతో ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారతాయని అధికారులు పేర్కొన్నారు.


FASTag Annual Pass
NHAI
National Highways Authority of India
toll plaza
Rajmargayatra app
highway toll
toll tax
India highways
Ministry of Road Transport and Highways
toll collection

More Telugu News