AP Electricity Department: త్వరలో ఏపీ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల జాతర .. ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP Electricity Department to Fill Thousands of Vacancies Soon
  • రాష్ట్ర విద్యుత్ శాఖల్లో 9,849 ఖాళీలు
  • 75 శాతం పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం
  • త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 9,849 ఖాళీల్లో సుమారు 75 శాతం పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంబంధిత శాఖలకు అధికారిక ఆదేశాలు జారీ చేయనున్నారు.

ఈ నియామకాల్లో టెక్నికల్ కేడర్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) – సివిల్, ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ, జూనియర్ ఇంజినీర్లు, నాన్ టెక్నికల్ కేడర్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, ఓ అండ్ ఎం విభాగంలో జూనియర్ లైన్‌మెన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.

పదవీ విరమణలు, పదోన్నతులతో పెరిగిన ఖాళీలు

వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో నియామకాలపై స్పష్టత నివ్వకుండా ఉండటంతో, కేడర్ మారిన సిబ్బంది సీట్లు మారకుండా, రెండు విధులతో పని చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా, ఉద్యోగులపై పని భారం పెరిగి, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

2014లో తెదేపా ప్రభుత్వం కొద్దిపాటి భర్తీలు మాత్రమే చేపట్టగా, ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 40 శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉండటంతో, విద్యుత్ సంస్థలు సాంకేతికంగా బలహీనమవుతున్నాయని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

గత ఐదేళ్లలో వీటీపీఎస్, కృష్ణపట్నంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున కొత్త థర్మల్ ప్లాంట్లు ఉత్పత్తిలోకి వచ్చినప్పటికీ, అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. ఉన్నవారితోనే సర్దుబాటు చేశారు. దీంతో థర్మల్ ప్లాంట్లలో సాంకేతిక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. సిబ్బందిని శిక్షణ కోసం బయటి ప్రాంతాలకు పంపే ప్రక్రియ నిలిచిపోయింది.

త్వరలో నోటిఫికేషన్?

ఉన్నతాధికారులు ప్రస్తుతం అత్యవసరంగా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. త్వరలో నియామకాలపై ప్రక్రియ ప్రారంభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 
AP Electricity Department
AP Transco
APGENCO
Andhra Pradesh jobs
electricity jobs
govt jobs AP
AEE jobs
Junior lineman
energy assistant
AP power sector

More Telugu News