Komati Reddy Raj Gopal Reddy: విమర్శించడం లేదంటూనే రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్

Komati Reddy Raj Gopal Reddy Fires on Revanth Reddy Over Funds
  • పదవులు, పైసలు రెండూ మీకేనా? అంటూ రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం
  • బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేయట్లేదన్న మునుగోడు ఎమ్మెల్యే
  • తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగమని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల తరచూ విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సొంతపార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో గత రాత్రి నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘పదవులూ మీకే.. పైసలూ మీకేనా?’ అని నిలదీశారు.  వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్ పని చేయడం లేదని, ముఖ్యమంత్రి ఇస్తేనే ఆ బిల్లు వస్తుందని అన్నారు. కాబట్టే సీఎంను ప్రశ్నిస్తున్నానని, అంతేకానీ, రేవంత్‌రెడ్డిని, పార్టీని విమర్శించడం లేదని అన్నారు. 

గత 20 నెలలుగా తన నియోజకవర్గం మునుగోడులో రోడ్లు, భవనాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రి వద్దకు వెళ్లి అడిగినా రాలేదని, వందసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాబట్టి పదవుల్లోనూ మీరే, పైసలూ మీరే తీసుకుంటున్నారని అడగాలా? వద్దా? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, అది వచ్చేటప్పుడు ఎవరు ఆపినా ఆగదని తేల్చి చెప్పారు. తనకు పదవి వస్తే దాని వల్ల ప్రజలకే లాభమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచోళ్లను ఎన్నుకోవాలని, వారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం పోరాడతానని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. 
Komati Reddy Raj Gopal Reddy
Revanth Reddy
Telangana Politics
Munugodu Constituency
Yadadri Bhuvanagiri
Choutuppal
Congress Party
Telangana Roads
MLA Comments
Sardar Vallabhbhai Patel

More Telugu News