La Ganesan: నాగాలాండ్ గవర్నర్ కన్నుమూత

Nagaland Governor La Ganesan Passes Away
  • ఈ నెల 8న చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలిన గవర్నర్ గణేశన్ 
  • తలకు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత 
  • విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు
నాగాలాండ్ గవర్నర్, బీజేపీ మాజీ ఎంపీ ఎల్. గణేశన్ (80) నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఈ నెల 8న చెన్నైలోని తన నివాసంలో కుప్పకూలడంతో గణేశన్ తలకు గాయమై ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యులు అప్పటి నుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు.

ఆయన అంత్యక్రియలు నేడు (శనివారం) నిర్వహించనున్నారు. గణేశన్ భౌతికకాయాన్ని రాజకీయ నాయకులు, బంధువుల సందర్శనార్థం ఈ రోజు ఉదయం ఆయన నివాసంలో ఉంచుతారు.

తంజావూరులో 1945 ఫిబ్రవరి 16న జన్మించిన గణేశన్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఆయన తండ్రి, సోదరులకు కూడా ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు ఉండటంతో 1970లో గణేశన్ పూర్తి స్థాయి ప్రచారక్‌గా మారారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు మధురై తదితర ప్రాంతాల్లో సంఘ్‌లో సేవలందించి, 1991లో బీజేపీలో చేరి తమిళనాడు పార్టీ శాఖ సంస్థాగత కార్యదర్శిగా సేవలందించారు.

తమిళనాట బీజేపీ బలోపేతానికి కృషి చేసిన ఆయన ఆ తర్వాత జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పని చేశారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఆగస్టులో మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2023లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు.

తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేశానికి సేవలందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన జాతీయవాదిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమిళనాడులో పార్టీ బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని మోడీ కొనియాడారు. 
La Ganesan
Nagaland Governor
BJP Leader
Tamil Nadu BJP
Manipur Governor
West Bengal Governor
Rajya Sabha MP
RSS
Narendra Modi
Political Leader Death

More Telugu News