India: పాక్ నేతల కవ్వింపు చర్యలు.. తీవ్రంగా హెచ్చరించిన భారత్

India warns Pakistan over provocative statements
  • పాక్ నేతల వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైశ్వాల్ ఆగ్రహం
  • పదేపదే నిర్లక్ష్యపూరిత, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్య
  • సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని విమర్శ
పాకిస్థాన్ నాయకుల పదేపదే నిర్లక్ష్యపూరిత, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటన విడుదల చేశారు. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వారు భారత వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని ఆయన అన్నారు. పాకిస్థాన్ నాయకులు తమ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిదని హితవు పలికారు.

అమెరికా, భారత్ సంబంధాలపై కూడా ఆయన స్పందించారు. ఈ రెండు దేశాల భాగస్వామ్యం అనేక సవాళ్లు, మార్పులను తట్టుకొని నిలబడిందని జైశ్వాల్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం కీలకమైనదని ఆయన తెలిపారు.

ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరుదేశాలు పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా ఇది మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
India
Pakistan
Ranadhir Jaiswal
India Pakistan relations
Foreign Affairs
War
Hate speech

More Telugu News