Nara Lokesh: ఇంగ్లీష్ మార్కుల సమస్య... నీట్ ర్యాంకర్‌ను ఆదుకున్న మంత్రి లోకేశ్

Nara Lokesh Helps NEET Ranker with English Marks Issue
  • నీట్ ర్యాంకర్, దివ్యాంగ విద్యార్థికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేశ్
  • తిరుపతికి చెందిన హరిహర బ్రహ్మారెడ్డికి నిబంధనల కారణంగా మెడికల్ సీటుకు ఆటంకం
  • ఇంటర్ మెమోలో ఇంగ్లీష్ సబ్జెక్టు మినహాయింపుతో తలెత్తిన సమస్య
  • మంత్రి లోకేశ్ చొరవతో ప్రత్యేక జీవో ద్వారా కనీస మార్కులు 
  • గతంలో 25 మంది ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు కూడా ఇదే తరహాలో సాయం
  • మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి కుటుంబం
సాంకేతిక నిబంధనల కారణంగా మెడికల్ సీటు కోల్పోయే ప్రమాదంలో ఉన్న ఓ దివ్యాంగ విద్యార్థికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించి అండగా నిలిచారు. ఆయన చొరవతో విద్యార్థి వైద్య విద్య కలను సాకారం చేసుకునే అవకాశం దక్కింది. గతంలో ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకర్లకు ఇదే తరహాలో సాయం చేసిన లోకేశ్, ఇప్పుడు నీట్ ర్యాంకర్‌కు బాసటగా నిలిచి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

గతంలో ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకర్లకు ఇంటర్ మార్కుల మెమో విషయంలో తలెత్తిన ఇబ్బందులపై తక్షణమే స్పందించి 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్ కాపాడిన మంత్రి నారా లోకేశ్ నేడు నీట్ ర్యాంకర్ కు అండగా నిలిచారు. తిరుపతికి చెందిన దివ్యాంగ విద్యార్థి దాసారెడ్డి హరిహర బ్రహ్మారెడ్డి ఇంటర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్ లో ఫస్ట్ లేదా సెకెండ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ ఎంచుకోకుండా మినహాయింపు ఉంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్ధాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో దివ్యాంగ కేటగిరీలో 1174వ ర్యాంక్ సాధించిన హరిహర బ్రహ్మారెడ్డికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు లభించే అవకాశం ఉంది. ఈ నెల 19న కౌన్సిలింగ్ కు హాజరుకావాల్సి ఉంది. 

అయితే నీట్ నిబంధనల ప్రకారం ఇంటర్ లో తప్పనిసరిగా ఇంగ్లీష్ ను ఫస్ట్ లేదా సెకెండ్ లాంగ్వేజ్ గా ఎంచుకోవాలి. ఇంటర్ మార్కుల మెమోలో ఫస్ట్ లాంగ్వేజ్ అనే కాలమ్ వద్ద 'E' (ఎగ్జెంప్టెడ్) అని ఉండటంతో మెడికల్ సీటు కోల్పోతామని విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ మంత్రి నారా లోకేశ్ ను ఆశ్రయించారు. దీంతో తక్షణమే స్పందించిన మంత్రి లోకేశ్.. గతంలో ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీస మార్కులు 35 కలుపుతూ జారీ చేసిన ప్రత్యేక జీవో ద్వారానే బైపీసీ విద్యార్థికి కూడా మార్కుల మెమోలో కూడా కనీస మార్కులు కలిపి సమస్యను పరిష్కరించారు. తక్షణమే స్పందించి తమకు అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేశ్ కు విద్యార్థి, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Nara Lokesh
NEET ranker
Divyang student
Medical seat
Education minister
Andhra Pradesh
IIT NIT
Harihara Brahmareddy
English marks issue
Counseling

More Telugu News