YS Sharmila: మీదొక పార్టీ... మీరొక నాయకుడు!: జగన్ హాట్‌లైన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్

YS Sharmila Fires on Jagan Over Hot Line Comments
  • రాహుల్-బాబు హాట్‌లైన్ వ్యాఖ్యలపై జగన్‌కు షర్మిల కౌంటర్
  • మోదీ, అమిత్ షాతో జగన్‌కే అసలైన హాట్‌లైన్ ఉందని వ్యాఖ్యలు
  • మోదీకి జగన్ దత్తపుత్రుడిలా మారారంటూ తీవ్ర విమర్శ
  • అసెంబ్లీకి వెళ్లరు, పార్లమెంటులో మాట్లాడరు అని ఫైర్
  • ప్రత్యేక హోదా, పోలవరంపై పోరాడే ధైర్యం లేదని ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, చంద్రబాబుకు మధ్య హాట్‌లైన్ ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అసలైన హాట్‌లైన్ జగన్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మధ్యే ఉందని ఆమె ఎదురుదాడి చేశారు. మోదీకి దత్తపుత్రుడిగా మారి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం కూడా జగన్‌కు లేదని ఆమె విమర్శించారు.

గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన షర్మిల, జగన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తెరవెనుక రాజకీయాలు, పొత్తులు పెట్టుకోవడం జగన్‌కు అలవాటు కాబట్టే అందరూ అలాగే చేస్తారని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీకి చంద్రబాబుతో ఎలాంటి హాట్‌లైన్ లేదు. ఈ హామీ మేము ఇవ్వగలం. మరి, మీకు మోదీ, అమిత్ షాలతో హాట్‌లైన్ లేదని బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పగలరా?" అని జగన్‌ను ఆమె నిలదీశారు.

గత ఐదేళ్ల పాలనలో జగన్ పూర్తిగా బీజేపీకి దాసోహమయ్యారని షర్మిల ఆరోపించారు. "మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అధికారంలోకి వచ్చిన మీరు, ఆ తర్వాత అదే మోదీకి ఎన్నోసార్లు సాగిలపడ్డారు. బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. గంగవరం పోర్టు వంటి ఎన్నో విలువైన ప్రాజెక్టులను మోదీ మనుషులకు కట్టబెట్టారు. చివరికి బీజేపీ నేతలకు ఎంపీ పదవులు కూడా ఇచ్చారు. దీన్ని అక్రమ పొత్తు అనాలా? లేక రాజకీయ వ్యభిచారం అనాలా?" అని ఆమె ప్రశ్నించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని ఒక మతతత్వ పార్టీగా అభివర్ణిస్తూ అన్ని వేదికలపైనా తీవ్రంగా వ్యతిరేకించారని షర్మిల గుర్తుచేశారు. కానీ, ఆయన కొడుకునని చెప్పుకునే జగన్, అదే బీజేపీకి దత్తపుత్రుడిగా మారడం సిగ్గుచేటని విమర్శించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌ను 'ఎవడు వాడు' అన్నట్లుగా జగన్ మాట్లాడటం ఆయన సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు. "మోదీకి వ్యతిరేకంగా పోరాడే దమ్ము మీకుందా అని మాణికం ఠాగూర్ విసిరిన సవాలుకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్‌పై సంజాయిషీ ఇవ్వండి. నాసిరకం బ్రాండ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారో, నగదు రూపంలోనే ఎందుకు అమ్మకాలు జరిపారో వివరించండి" అని డిమాండ్ చేశారు.

అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదని, పార్లమెంటుకు వెళ్లి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం అసెంబ్లీలో, దేశం కోసం పార్లమెంటులో పోరాడలేరు కానీ... మీదొక పార్టీ, మీరొక నాయకుడు... అంటూ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
YS Sharmila
Jagan Mohan Reddy
APCC
Andhra Pradesh Congress
BJP
Narendra Modi
Amit Shah
Chandrababu Naidu
Rahul Gandhi
AP Politics

More Telugu News