Ishaq Dar: స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. మళ్లీ కశ్మీర్ రాగం తీసిన పాకిస్థాన్

Pakistan continues ranting about Kashmir on its Independence Day
  • ఈ రోజు పాకిస్థాన్ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించిన ఉప ప్ర‌ధాని ఇషాక్ దార్
  • కశ్మీరీల పోరాటానికి తమ మద్దతు అచంచలమని స్పష్టీకరణ
  • పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనూ పాక్ వైఖరిలో లేనిమార్పు
  • పాక్‌తో వాణిజ్యం, ఉగ్రవాద నిరోధంపై అమెరికా ఆసక్తి
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిపిన భీకర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, పాక్‌ తన వైఖరిని మార్చుకోలేదు. ఇవాళ‌ తమ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి కశ్మీర్ రాగాన్ని అందుకున్నారు. కశ్మీరీల పోరాటానికి తమ మద్దతు తిరుగులేనిదని, న్యాయం జరిగే వరకు అది కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇషాక్ దార్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ అలీ జిన్నా దార్శనికతను, పాకిస్థాన్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. "గత 78 ఏళ్లలో పాకిస్థాన్ వ్యవసాయం నుంచి ఐటీ ఎగుమతుల వరకు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఆర్థికాభివృద్ధి వరకు అద్భుతమైన ప్రగతిని సాధించింది. 25 కోట్ల జనాభాతో ఐక్యత, విశ్వాసం, క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం" అని దార్ పేర్కొన్నారు.

భారత‌ చట్టవిరుద్ధమైన చర్యలను సైనిక సన్నద్ధత, దౌత్యపరమైన నేర్పుతో ఎదుర్కొన్నామని, తద్వారా నైతిక, రాజకీయ విజయం సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని "మార్కా-ఎ-హక్" విజయంగా అభివర్ణించారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో తమ నిబద్ధతను ఇది చాటిచెప్పిందని అన్నారు. "కశ్మీర్ అంశం న్యాయబద్ధమైంది. కశ్మీరీ ప్రజల హక్కులు విడదీయరానివి. వారికి న్యాయం జరిగే వరకు మా మద్దతు కొన‌సాగుతుంది" అని దార్ స్పష్టం చేశారు.

ఇక‌, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ, అమెరికా భిన్నంగా స్పందించడం గమనార్హం. ఉగ్రవాద నిరోధం, వాణిజ్య రంగాలలో పాకిస్థాన్ సహకారాన్ని తాము ఎంతో అభినందిస్తున్నామని పేర్కొంటూ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బలూచిస్థాన్‌లో వాణిజ్య ప్రయోజనాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం పాక్‌తో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Ishaq Dar
Pakistan Independence Day
Kashmir issue
Pakistan foreign policy
India Pakistan relations
Pahalgam attack
Marco Rubio
US Pakistan relations
Balochistan
Terrorism

More Telugu News