: పులివెందులలో వైసీపీ ఓటమిపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

  • జగన్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పు చెబుతోందన్న అనిత
  • వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా
  • పులివెందుల ఓటమి జగన్ కు చెంపపెట్టు అని వ్యాఖ్య
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగురవేశామని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పు చెబుతోందని అనిత అన్నారు. వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. గతంలో పులివెందులలో ఓటర్లు ధైర్యంగా ఓటు వేసే పరిస్థితి లేదని... ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ధైర్యంగా ఓటు వేశారని చెప్పారు. పోలీసులను వైసీపీ నేతలు విమర్శించడం సరికాదని అన్నారు. 

పులివెందుల ఓటమి జగన్ కు చెంపదెబ్బ అని అని చెప్పారు. సీఎం చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా జగన్ అనుచితంగా మాట్లాడటం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విలువను పులివెందుల ప్రజలు పెంచారని తెలిపారు. ఓవైపు తనకు రక్షణ పెంచాలని కోరుతున్న జగన్... మరోవైపు పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని దూషించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

More Telugu News