Ramesh Garge: నాలుగు నిమిషాల్లో రూ. 5 లక్షల సొత్తు అపహరణ.. మెలకువ రాక బతికిపోయిన రిటైర్డ్ జడ్జి కొడుకు.. వీడియో ఇదిగో!

Ramesh Garge House Robbed 5 Lakhs Worth Looted in 4 Minutes
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • రిటైర్డ్ జడ్జి రమేశ్ గార్గ్ ఇంట్లోకి చొరబడిన దొంగలు
  • మోగని అలారం.. నిమిషాల్లో పని పూర్తిచేసుకెళ్లిన వైనం
మధ్యప్రదేశ్‌, ఇండోర్‌లోని విక్రమ్ నగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ జడ్జి రమేశ్ గార్గ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. ముగ్గురు దొంగలు కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో ఐదు లక్షల రూపాయలకు పైగా విలువైన నగలు, నగదును దోచుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

విజయ్ నగర్‌లో ఉన్న రిటైర్డ్ జడ్జి బంగ్లాలోకి ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో దొంగలు చొరబడ్డారు. ముఖానికి మాస్కు ధరించిన దొంగలు ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. ఒక దొంగ ఇనుప రాడ్డు పట్టుకుని నిద్రిస్తున్న రమేశ్ గార్గ్ కుమారుడు రిత్విక్ బెడ్ వద్ద రెడీగా ఉన్నాడు. ఒకవేళ ఆయన లేస్తే కొట్టి చంపేయాలని రాడ్డు ఎత్తి పట్టుకున్నాడు. 

అయితే, ఆయనకు మెలకువ రాకపోవడంతో బతికిపోయారు. మిగిలిన ఇద్దరు దొంగలు బీరువా పగలగొట్టి నగదు, నగలను ఎత్తుకెళ్లారు. కేవలం నాలుగు నిమిషాల పది సెకన్లలోనే ఈ దోపిడీ పూర్తి చేసి అక్కడి నుంచి పారిపోయారు. చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అయింది.

ఈ ఘటన జరిగిన సమయంలో రిటైర్డ్ జడ్జి రమేశ్ గార్గ్ కుటుంబసభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. అయితే దొంగలు కిటికీ ఇనుప గ్రిల్‌ను కత్తిరించి లోపలికి వచ్చినా అలారం మోగకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇంటి బయట సెక్యూరిటీ గార్డు ఉన్నా దొంగలు అడ్డూఅదుపు లేకుండా చోరీకి పాల్పడ్డారు. మరో గదిలో రిత్విక్ భార్య, పిల్లలు నిద్రిస్తున్నారు. అలారం మోగకపోవడంతో చోరీ విషయం ఎవరికీ తెలియలేదు. ఈ సంఘటన విజయ్ నగర్ వంటి సంపన్న ప్రాంతంలో కూడా భద్రతపై ఆందోళనలను పెంచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Ramesh Garge
Indore robbery
retired judge
Vikram Nagar
crime news
CCTV footage
house theft
Madhya Pradesh police
Vijay Nagar
Rithvik Garge

More Telugu News