AP High Court: ఐటీ కంపెనీలకు భూకేటాయింపులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court Key Comments on Land Allotments to IT Companies
  • ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎందుకు ముందుకు వస్తాయన్న హైకోర్టు
  • కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య
  • ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న హైకోర్టు
ప్రముఖ కంపెనీలకు భూకేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విశాఖ జిల్లా మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కు 22 ఎకరాలను ఎకరాకు 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ వివిధ సంస్థలు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా భూములు కేటాయిస్తున్నామని వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని చెప్పింది. విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు హైకోర్టు అభిప్రాయపడింది. పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని వ్యాఖ్యానించింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకు వస్తుందని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.

ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే బెంగళూరు, హైదరాబాద్ లకు కంపెనీలు తరలిపోతాయని పేర్కొంది. ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పింది. కంపెనీలకు భూ కేటాయింపుల వల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. వివిధ సంస్థలకు భూకేటాయింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 
AP High Court
Cognizant Technology Solutions
Andhra Pradesh
Visakhapatnam
land allocation
IT companies
Dheeraj Singh Thakur
Cheemalapati Ravi
AP government

More Telugu News