Instagram Influencer: 12 లక్షల ఫాలోవర్లు.. రూ.40 కోట్ల మనీలాండరింగ్.. ఈడీకి చిక్కిన ఇన్‌స్టా స్టార్

Influencer With 12 Lakh Instagram Followers Arrested In Rs 40 Crore Laundering Case
  • రూ.40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ అరెస్ట్
  • నకిలీ బ్యూటీ ప్రొడక్ట్స్ వెబ్‌సైట్‌తో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు
  • ఢిల్లీ, ముంబైలలో పలుచోట్ల ఈడీ విస్తృత సోదాలు
  • రిలయన్స్ క్యాపిటల్ మాజీ డైరెక్టర్‌తో సందీపాకు సంబంధాలున్నట్లు గుర్తింపు
  • ఈ నెల 15 వరకు ఈడీ కస్టడీలో సందీపా విర్క్‌
సోషల్ మీడియాలో తనను తాను నటిగా, వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుంటూ 12 లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.40 కోట్ల భారీ మనీలాండరింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. నకిలీ వాగ్దానాలతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మొహాలీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ (సెక్షన్ 420), నేరపూరిత నమ్మకద్రోహం (సెక్షన్ 406) కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసిన అధికారులు.. మంగళ, బుధవారాల్లో ఢిల్లీ, ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈడీ విచారణ ప్రకారం, సందీపా విర్క్ hyboocare.com అనే వెబ్‌సైట్‌ను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడినట్లు తేలింది. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్లు ఈ వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకున్నారు. అయితే, విచారణలో ఆ వెబ్‌సైట్‌లో ఎలాంటి ఉత్పత్తులు లేవని, యూజర్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా లేదని ఈడీ గుర్తించింది. పేమెంట్ గేట్‌వేలు నిత్యం విఫలమవడం, వాట్సాప్ నంబర్ పనిచేయకపోవడం వంటి అంశాలను బట్టి ఇది కేవలం నిధుల మళ్లింపు కోసం ఏర్పాటు చేసిన బూటకపు వెబ్‌సైట్ అని అధికారులు నిర్ధారించారు.

ఈ కేసు విచారణలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అయిన అంగరై నటరాజన్ సేతురామన్‌తో సందీపాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సేతురామన్‌కు ఎలాంటి నిబంధనలు పాటించకుండా రూ.18 కోట్ల ప్రజాధనాన్ని మంజూరు చేశారని, అలాగే రిలయన్స్ క్యాపిటల్ నుంచి రూ.22 కోట్ల గృహ రుణం కూడా అక్రమంగా కేటాయించారని ఈడీ ఆరోపించింది. ఈ నిధుల్లో అధిక భాగం దారి మళ్లినట్లు, ఇప్పటికీ అవి చెల్లించలేదని అధికారులు తెలిపారు. 

అయితే, ఈ ఆరోపణలను సేతురామన్ ఖండించారు. తనకు సందీపా విర్క్‌తో గానీ, ఈ లావాదేవీలతో గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 12న అరెస్ట్ అయిన సందీపా విర్క్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు శుక్రవారం వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపైనా ఈడీ విచారణ జరుపుతోంది.
Instagram Influencer
Sandeepa Virk
money laundering
ED
Enforcement Directorate
hyboocare com
Angarai Natarajan Sethuraman
Reliance Capital
fraud case
social media

More Telugu News