Kinjarapu Atchannaidu: ఆక్వా రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Kinjarapu Atchannaidu Announces Good News for Aqua Farmers
  • రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతామన్న మంత్రి అచ్చెన్నాయుడు
  • ఆక్వా రైతుల అభ్యున్న‌తికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతుందన్న మంత్రి  
  • ఆక్వా కల్చర్ యూనిట్లు అన్నీ రిజిస్టర్ కావాలన్న అచ్చెన్నాయుడు
రాష్ట్ర ఆక్వా కల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని ఏపీ వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నిన్న వెలగపూడి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై సమగ్రంగా అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆక్వా కల్చర్ లైసెన్స్ ప్రక్రియ సరళీకరణ

రైతులు ఇకపై రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చట్టం కింద తమ ఆక్వా చెరువులను ఆన్‌లైన్‌లో సులభంగా నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విధానం ద్వారా లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రయోజన పథకాలు పొందడానికి ప్రతి ఆక్వా కల్చర్ రైతు తమ చెరువులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల నాణ్యతను, ట్రేసబిలిటీని మెరుగుపరచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. డి-పట్టా, అసైన్, సీజేఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న రైతులకు ఆక్వా అభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా వారు ప్రభుత్వ పథకాలు మరియు ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగుతుందని తెలియజేశారు.

పౌల్ట్రీ వ్యర్థాల వాడకంపై నిషేధం

కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీ వ్యర్థాలను చేపల ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించామని మంత్రి అన్నారు. ఇది ప్రజారోగ్యానికి హానికరంతో పాటు నీటి కాలుష్యం కావడంతో ఈ ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతులు వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. చెరువుల యజమానులు చికెన్ వ్యర్థాలను చేపల ఆహారంగా వేసినట్లు రుజువైతే వెంటనే వారి లైసెన్సులను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అమెరికా టారిఫ్ల ప్రభావం తగ్గించడానికి చర్యలు

2025 ఆగస్టు 27 నుండి భారతీయ రొయ్య ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50% టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. MPEDA సహకారంతో దక్షిణ కొరియా, యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. యూకేతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు. ఎగుమతిదారులు, ప్రాసెసర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలన్నారు. ఆక్వా రైతుల‌కు మేలు జ‌రిగేలా అధిక సుంకాల వ్య‌వహా‌రంపై సీఎం చంద్ర‌బాబునాయుడు కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జరుపుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో APSADA కో-వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయిక్, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Kinjarapu Atchannaidu
AP aquaculture
aquaculture farmers
Andhra Pradesh fisheries
aquaculture license
shrimp exports
poultry waste ban
fish farming
MPEDA
free trade agreement

More Telugu News