Ravichandran Ashwin: కాన్వే పేరుతో అశ్విన్‌కు టోకరా.. కోహ్లీ, ధోనీ నెంబర్లు కావాలంటూ మెసేజ్!

Ravichandran Ashwin tricked by fake Devon Conway for Kohli number
  • డెవాన్ కాన్వే పేరుతో అశ్విన్‌కు వాట్సాప్‌లో మెసేజ్
  • కోహ్లీ, రోహిత్, ధోనీ ఫోన్ నెంబర్లు అడిగిన ఆగంతుకుడు
  • అనుమానంతో బ్యాట్ గురించి ప్రశ్నించిన అశ్విన్
  • పప్పులో కాలేసిన కేటుగాడు.. వెంటనే నంబర్ బ్లాక్ చేసిన స్పిన్నర్
  • యూట్యూబ్ ఛానల్‌లో ఘటనను పంచుకున్న రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా సీనియర్ స్పిన్నర్, క్రికెట్ మేధావిగా పేరున్న రవిచంద్రన్ అశ్విన్‌కే ఓ సైబర్ నేరగాడు టోకరా వేయాలని చూశాడు. చెన్నై సూపర్ కింగ్స్ సహచర ఆటగాడు డెవాన్ కాన్వే పేరుతో వాట్సాప్‌లో సంప్రదించి, అతడిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత జరిగిన ఈ ఆసక్తికర ఘటనను అశ్విన్ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా వెల్లడించాడు.

ఐపీఎల్ ముగిశాక ఓ గుర్తుతెలియని వ్యక్తి డెవాన్ కాన్వే పేరుతో అశ్విన్‌కు మెసేజ్ పంపాడు. నిజంగా కాన్వేనే అని నమ్మిన అశ్విన్ అతడితో చాటింగ్ కొనసాగించాడు. అయితే, కాసేపటికే ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ ఫోన్ నెంబర్ అడిగాడు. దాంతో అశ్విన్... కోహ్లీ నెంబర్ పంపించాడు. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ వంటి స్టార్ క్రికెటర్ల ఫోన్ నెంబర్లు అడగడంతో అశ్విన్‌కు అనుమానం మొదలైంది. దీంతో అతడిని పరీక్షించాలనే ఉద్దేశంతో, తాను ఇచ్చిన బ్యాట్ ఎలా ఉందని అశ్విన్ ప్రశ్నించాడు. వాస్తవానికి అశ్విన్ అలాంటి బ్యాట్ ఏదీ ఇవ్వలేదు.

అయితే, అవతలి వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా ‘బ్యాట్ అద్భుతంగా ఉంది’ అని సమాధానం ఇవ్వడంతో అతడు ఫేక్ అని అశ్విన్‌కు పూర్తిగా అర్థమైంది. వెంటనే అప్రమత్తమైన అశ్విన్, ఆ నెంబర్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపాడు. ఈ ఘటనపై తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ, "అదృష్టవశాత్తూ నేను విరాట్ కోహ్లీ పాత నెంబర్‌ను మాత్రమే పంపాను. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాట్సాప్ గ్రూప్‌లో చెక్ చేయగా అది నకిలీ నంబర్ అని నిర్ధారణ అయింది" అని వివరించాడు.


Ravichandran Ashwin
Ashwin
Devon Conway
Virat Kohli
MS Dhoni
cyber crime
IPL 2025
Chennai Super Kings
phone number scam
cricketers phone numbers

More Telugu News