YS Jagan Mohan Reddy: ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు.. పులివెందుల ఘటనలపై జగన్

Jagan Alleges TDP Misconduct in Pulivendula ZPTC Polls
  • పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికపై వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు
  • టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ కొన్ని వీడియోల ప్రదర్శన
  • ‘కాల్చి పారేస్తా’ అంటూ డీఎస్పీ బెదిరించారని  విమర్శ
  • మంత్రి రామప్రసాద్ రెడ్డి బూత్‌లోకి వెళ్లి ఏజెంట్లపై దాడి చేశారని ఆరోపణ
  • ఓటమి భయంతోనే టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని జగన్ వ్యాఖ్య
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ నేతలు పోలీసులను, మంత్రులను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలకు సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్‌లను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు.

పులివెందుల డీఎస్పీ ఒకరు ‘కాల్చి పారేస్తా నా కొ..!’ అంటూ తమ పార్టీ కార్యకర్తలను బెదిరించారని జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ప్లే చేసి చూపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతుంటే, ఓ అధికారి ఇలాంటి భాష వాడటం దారుణమని ఆయన మండిపడ్డారు. దీనికితోడు, పులివెందుల పట్టణంలోని వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి హడావిడి సృష్టించారని ఆరోపించారు.

మరో ఘటనలో, రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రామప్రసాద్ రెడ్డికి సంబంధం లేకపోయినా ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లె గ్రామానికి వెళ్లి పోలింగ్ బూత్‌లో రౌడీయిజం చేశారని జగన్ విమర్శించారు. మంత్రి సమక్షంలోనే తమ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాగి, వారిపై దాడి చేశారని ఆరోపించారు. తుమ్మలపల్లి గ్రామంలో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత భూపేశ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించారని, ఓటర్ల స్లిప్పులు పంచుతూ కెమెరాకు చిక్కారని తెలిపారు.

ప్రజల మద్దతుపై నమ్మకం లేకపోవడం వల్లే చంద్రబాబు ఇలాంటి దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. ప్రజలు తమకు ఓటు వేయరనే భయంతోనే టీడీపీ నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని అన్నారు. 2017లో నంద్యాల ఉపఎన్నికలో కూడా టీడీపీ ఇదే తరహాలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన గుర్తుచేశారు. నిజంగా ప్రజలకు మంచి చేసి ఉంటే, ఇలాంటి అక్రమాలకు దిగాల్సిన అవసరం ఏముందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. 
YS Jagan Mohan Reddy
Pulivendula
TDP
Andhra Pradesh Politics
ZPTC Election
Chandrababu Naidu
YSRCP
Election Violence
Police Misconduct
Rayachoti MLA

More Telugu News