Harbhajan Singh: దేశం ముందు క్రికెట్ చాలా చిన్నది.. సైనికుల ప్రాణాల కన్నా పాక్‌తో మ్యాచ్ గొప్పదా?: హర్భజన్

Harbhajan Singh Slams India Pakistan Asia Cup Match
  • ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌పై భజ్జీ తీవ్ర అభ్యంతరం
  • రక్తం, చెమట కలిసి ప్రవహించవంటూ ఘాటు వ్యాఖ్యలు
  • ఇటీవలే లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన భారత ఆటగాళ్లు
  • పాక్ ఆటగాళ్లకు, వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వొద్దని సూచన
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడనుండటంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, పాక్ తో క్రికెట్ ఆడటం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల ముందు క్రికెట్ చాలా చిన్న విషయమని, ఈ మ్యాచ్‌ను వెంటనే బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశాడు.

ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో హర్భజన్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ వంటి భారత మాజీ ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగక ముందే ఆసియా కప్ షెడ్యూల్ విడుదల కావడం, అందులో భారత్-పాక్ ఒకే గ్రూపులో ఉండటంతో ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో హర్భజన్ మాట్లాడుతూ, "ఒకవైపు మన సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వారి కుటుంబాలు కనీసం వారిని చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వారి త్యాగాలతో పోలిస్తే, మనం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడకపోవడం చాలా చిన్న‌ విషయం. దీన్ని బీసీసీఐ అర్థం చేసుకోవాలి" అని అన్నాడు.

"రక్తం, చెమట ఒకేసారి కలిసి ప్రవహించలేవు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, మనం పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటంలో అర్థం లేదు. ఈ పెద్ద సమస్యలు పరిష్కారమయ్యే వరకు క్రికెట్ గురించి ఆలోచించకూడదు. దేశమే ఎప్పటికీ ప్రథమం" అని హర్భజన్ స్పష్టం చేశాడు.

"మనకంటూ ఒక గుర్తింపు ఉందంటే అది ఈ దేశం వల్లే. ఆటగాళ్లు అయినా, నటులు అయినా ఎవరూ దేశం కంటే గొప్పవారు కాదు. దేశానికి మనం చేయాల్సిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి" అని భ‌జ్జీ పేర్కొన్నాడు. అంతేకాకుండా, పాకిస్థాన్ ఆటగాళ్ల మాటలకు, వారి వార్తలకు భారత మీడియా ప్రాధాన్యం ఇవ్వకూడదని కూడా ఆయన సూచించాడు.

కాగా, ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది.


Harbhajan Singh
India vs Pakistan
Asia Cup 2025
Cricket
BCCI
Indian Soldiers
Indo-Pak Relations
Sports Boycott
World Championship of Legends
Border Tensions

More Telugu News