Chandrababu Naidu: ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి నిర్మాణం జరగాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Orders Speed Up of Amaravati Construction Approvals
  • అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • అధికారులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
  • గత ప్రభుత్వంలో ఇసుకనూ ఎత్తుకెళ్లారని సీఎంకు కాంట్రాక్టర్ల ఫిర్యాదు
  • రైతుల ప్లాట్ల బదిలీ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్న మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి సహా, వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పి.నారాయణ, పురపాలక, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో పాటు రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 

ప్రపంచంలో అత్యుత్తమ నివాస నగరంగా అమరావతి నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానిలో ఎల్పీఎస్ లే అవుట్లలో అభివృద్ధి పనుల పురోగతి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులు, న్యాయమూర్తుల నివాస భవనాలు, రహదారులు, డక్ట్ లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. 

రాజధానిలో ప్రస్తుతం ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని 74 పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. కాంట్రాక్టు సంస్థలు ఆయా పనుల్ని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. రాజధానిలో చేపడుతున్న నిర్మాణ పనుల ప్రగతి ప్రజలకు కనిపించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ నెలా అమరావతి పనుల పురోగతిపై సమీక్ష చేస్తానని సీఎం అన్నారు. 

సమయం ప్రకారం పనులు పూర్తి కాకపోతే ఎందుకు కాలేదన్న అంశంపై సదరు కాంట్రాక్టు సంస్థతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. దీంతో పాటు రియల్ టైమ్ లో పనుల పురోగతిని కూడా పర్యవేక్షిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆటో పైలట్ మోడ్ లో పనులు జరగాలని సూచించారు.

రైతులకు ఇబ్బంది లేని రీతిలో ప్లాట్ల బదిలీ

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించి మాస్టర్ ప్లాన్ కూడా ప్రభావితం కాకుండా ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ వారం రోజుల్లోగా ఈ అంశాన్ని కొలిక్కి తెస్తామని సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగక పోవటంతో నిర్మాణానికి తెచ్చిన ఇనుము, సామాగ్రి తుప్పు పట్టి పోయిందని కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. నిర్మాణం కోసం సేకరించిన ఇసుక నిల్వల్ని కూడా గత పాలకులు ఎత్తుకెళ్లారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఇసుకను భర్తీ చేయాల్సిందిగా మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

భూములు కేటాయించిన సంస్థలకు వేగంగా అనుమతులు

రాజధాని అమరావతిలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్న వివిధ సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బిట్స్ పిలానీ, ఎక్స్ ఎల్ఆర్ఐ తదితర సంస్థలకు త్వరితగతిన భూమిని కేటాయించాలని సూచించారు. అలాగే ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన 72 సంస్థలు ఏమేరకు నిర్మాణాలు చేపడుతున్నాయో నిరంతరం పర్యవేక్షించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సంస్థలకు స్థలం ఇచ్చేస్తేనే పని పూర్తికాదని వీటికి అనుసంధానంగా పెట్టుబడులు, వెంచర్లు కూడా రావాలన్నారు. ఒక్కో ఇటుకా పేరిస్తేనే రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని సీఎం అన్నారు. 

రాజధాని నగరంలో పెట్టుబడులతో పాటు నగరాభివృద్ధి కూడా జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. పెద్ద ప్రాజెక్టులను సీబీఎన్ మాత్రమే సమర్ధంగా చేయగలుగుతారని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ కూడా చెప్పారని... ఈ క్రెడిబిలిటికి నష్టం కలగకుండా చూడాలన్నారు. అమరావతిలో స్పోర్ట్ సిటీ, పర్యాటక ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్, బయోటెక్నాలజీ, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh Capital
APCRDA
Capital City Construction
Real Estate Amaravati
Infrastructure Development
Land Allocation
AP Government
Nara Lokesh

More Telugu News