YS Jagan: తీవ్ర ఉద్రిక్తతల నడుమ... ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ పోలింగ్

Pulivendula Ontimitta ZPTC Elections Polling Ends Amid Tensions
  • ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత
  • జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సహా నేతలు కేంద్రంలోకి చొరబాటు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు, ఆందోళనకారుల చెదరగొట్టారు
  •  రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. నిర్ణీత సమయానికి క్యూలైన్లలో నిలబడి ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే పులివెందులలో 71.36 శాతం, ఒంటిమిట్టలో 66.39 శాతం ఓటింగ్ నమోదైంది.

ఈ ఉప ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది. పులివెందులలో టీడీపీ తరఫున బీటెక్ రవి అర్ధాంగి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరఫున హేమంత్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం రెడ్డి పోటీ పడ్డారు. రెండు చోట్లా మొత్తం 11 మంది చొప్పున అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కాగా, ఒంటిమిట్టలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ కె. రవీంద్రనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో వారు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న బారికేడ్లు, కుర్చీలను తోసివేయడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసీపీ నేతలను చెదరగొట్టి, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.

YS Jagan
Pulivendula
Ontimitta
ZPTC Elections
YSR Kadapa
Andhra Pradesh Politics
TDP
YCP
Polling
Ravindranath Reddy

More Telugu News