Indian Railways: హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు

Indian Railways offers free Wi Fi services at 6115 railway stations
  • 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం
  • రాజ్యసభలో అధికారికంగా వెల్లడించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
  • దాదాపు అన్ని స్టేషన్లలో 4జీ/5జీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడి
  • హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలోనూ ఈ సౌకర్యం
దేశంలోని రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నెల‌ 8న రాజ్యసభలో అధికారికంగా వెల్లడించారు.

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. "దేశంలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో టెలికాం సంస్థలు 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. ప్రయాణికులు ఈ నెట్‌వర్క్‌లను డేటా కనెక్టివిటీ కోసం ఉపయోగించుకుంటున్నారు. దీనికి అదనంగా, ప్రయాణికుల సౌకర్యార్థం 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించాం" అని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు. రైల్‌టెల్ సంస్థ ఆధ్వర్యంలో 'రైల్‌వైర్' పేరుతో ఈ ఉచిత వైఫై సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్న ప్రధాన స్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, బెంగళూరు (యశ్వంత్‌పుర్), అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్‌సర్, ఎర్నాకుళం, ప్రయాగ్‌రాజ్ వంటి అనేక నగరాల్లోని స్టేషన్లలో కూడా ఈ సౌకర్యం కల్పించారు.

ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో వైఫై ఆప్షన్ ద్వారా 'రైల్‌వైర్' నెట్‌వర్క్‌ను ఎంచుకుని, తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అనంతరం ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేయడం ద్వారా ఉచిత ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలతో ప్రయాణికులు స్టేషన్ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆన్‌లైన్ పనులు చేసుకోవడానికి, వీడియోలు చూడటానికి వీలు కలుగుతుంది.
Indian Railways
Ashwini Vaishnaw
Free WiFi
RailWire
Railway Stations
Secunderabad
Hyderabad
Digital India
4G 5G services
Railtel

More Telugu News