Khazana Jewellers: చందానగర్ ఖజానా జువెలర్స్ లో దొంగల బీభత్సం... సిబ్బందిపై కాల్పులు

Robbery at Khazana Jewellers in Chandannagar Hyderabad
  • ఆరుగురు సభ్యుల దొంగల ముఠా దాడి 
  • అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు
  • దొంగల కోసం గాలిస్తున్న 10 పోలీసు బృందాలు
హైదరాబాద్ శివారు చందానగర్ లో దొంగలు రెచ్చిపోయారు. చందానగర్ లోని ప్రముఖ నగల దుకాణం ఖజానా జువెలర్స్ లో దొంగలు దోపిడీకి యత్నించారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా, కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో దొంగలు పారిపోయారు. పరారైన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. 

దొంగలు తొలుత ఖజానా జువెలర్స్ గేట్ వద్ద ఉన్న సిబ్బందిని గాయపరిచి లోపలకు ప్రవేశించారు. ఆ తర్వాత షాపు లోపల ఎదురు తిరిగిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. లాకర్ కీ ఇవ్వడానికి నిరాకరించిన అసిస్టెంట్ మేనేజర్ సతీశ్ పై కాల్పులు జరిపారు. దీంతో ఆయన కాలులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది.

షాపు లోపల నగలు ఉన్న స్టాల్స్ ను పగులగొట్టారు. తుపాకీతో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ దొంగల ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నట్టు సమాచారం. దొంగలు దొరికిన కాడికి దోచుకుని పరారయ్యారు. ఎక్కువగా వెండి వస్తువులు చోరీకి గురైనట్టు సమాచారం. దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా... జిల్లా సరిహద్దు పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. పరారైన దుండగుల కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో చందానగర్ లో భయానక వాతావరణం నెలకొంది.
Khazana Jewellers
Hyderabad robbery
Chandannagar
Jewellery store robbery
Telangana crime
shooting
police investigation
crime news
robbery attempt

More Telugu News