Bilawal Bhutto: సింధు జలాలపై కవ్వింపు.. యుద్ధానికి సిద్ధమన్న బిలావల్ భుట్టో

Bilawal Bhutto Warns India on Indus Waters Treaty
  • సింధు జలాల ఒప్పందం రద్దుపై బిలావల్ భుట్టో ఆగ్రహం
  • యుద్ధానికి దిగుతామని, వెనక్కి తగ్గేది లేదని వార్నింగ్
  • అణుయుద్ధం తప్పదన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్
  • భారత్ కట్టే డ్యామ్‌లను క్షిపణులతో కూల్చేస్తామని బెదిరింపు
  • పాక్ బెదిరింపులను తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
భారత్‌పై పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. ఆ దేశ రాజకీయ నాయకుడు, ఆర్మీ చీఫ్ వేర్వేరుగా తీవ్రస్థాయిలో యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఒక అడుగు ముందుకేసి అణుయుద్ధ ప్రస్తావన తీసుకురావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

సోమవారం సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆరోపించారు. "ఆపరేషన్ సిందూర్", సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. 

"మోదీకి, ఆయన దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా పాకిస్థానీయులంతా ఏకం కావాలి. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇదే వైఖరిని కొనసాగిస్తే, మా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం యుద్ధంతో పాటు అన్ని మార్గాలను పరిశీలించాల్సి ఉంటుంది. మేం తలవంచేది లేదు" అని బిలావల్ భుట్టో హెచ్చరించారు.

మరోవైపు, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మరింత తీవ్రంగా స్పందించారు. తమది అణ్వస్త్ర దేశమని, తమ ఉనికికే ప్రమాదం వస్తే ప్రపంచంలో సగాన్ని నాశనం చేస్తామని బెదిరించారు. "సింధు నదిపై భారత్ నిర్మించే ఏ డ్యామ్‌నైనా పది క్షిపణులతో కూల్చివేస్తాం. సింధు నది భారతీయుల జాగీరు కాదు. ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే 25 కోట్ల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

పాక్ బెదిరింపులపై భారత్ ఘాటు స్పందన
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరికలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి అణు బెదిరింపులు చేయడం పాకిస్థాన్‌కు పరిపాటిగా మారిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాద సంస్థలతో సైన్యం అంటకాగుతున్న దేశంలో అణ్వాయుధాల నియంత్రణ, భద్రతపై విశ్వసనీయత ఎంత ఉందో అంతర్జాతీయ సమాజం గమనించాలని సూచించింది. ఇలాంటి అణు బెదిరింపులకు భారత్ లొంగిపోదని, దేశ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
Bilawal Bhutto
Pakistan
India
Indus Waters Treaty
Narendra Modi
Asim Munir
Nuclear threat
War
Sindh province
Terrorism

More Telugu News