Donald Trump: చైనాపై వెనక్కు తగ్గిన ట్రంప్ .. వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం

Donald Trump Extends China Trade Deal Deadline by 90 Days
  • ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన ట్రంప్
  • వాణిజ్య ఒప్పందం చర్చల గడువును పొడిగించడం జరిగిందన్న చైనా
  • ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 30 శాతం సుంకాలను మాత్రమే అమలు చేస్తున్న అమెరికా
భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నారు. అయితే చైనా విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

చైనాపై తొలుత సుంకాల మోత మోగించిన ట్రంప్.. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వాణిజ్య ఒప్పందం చర్చల గడువును పొడిగించినట్లు చైనా కూడా తన అధికారిక మీడియా ద్వారా వెల్లడించింది.

చైనాతో వాణిజ్య ఒప్పందానికి తొలుత విధించిన 90 రోజుల గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు అమెరికా, చైనాలు పరస్పరం సుంకాలు (వంద శాతానికి పైగా) విధించుకున్నాయి. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 30 శాతం సుంకాలను మాత్రమే అమెరికా అమలు చేస్తోంది.

భారత్‌పై 25 శాతం అమలు చేస్తుండగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా ఈ నెల 27 నుంచి మరో 25 శాతం వసూలు చేసేందుకు సిద్ధమైంది. భారత్‌తో పాటు చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటుండగా, భారత్‌పై 50 శాతం సుంకాల మోత మోగించిన ట్రంప్.. చైనా విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించినట్లు కనబడుతోంది.

ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉందని, రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు. 
Donald Trump
China trade deal
US China trade
Trade tariffs
JD Vance
US trade policy
Russia oil imports
India tariffs
China tariffs

More Telugu News