Warangal Floods: రాత్రంతా కుండపోత.. వరంగల్, హనుమకొండలో వరద బీభత్సం

Warangal Hanumakonda Hit by Heavy Rains and Flooding
  • హనుమకొండ, వరంగల్‌లో మునిగిన లోతట్టు ప్రాంతాలు 
  •  పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటితో ప్రజల అవస్థలు
  •  డీకే నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
  •  సంగెం మండలంలో అత్యధికంగా 20 సెం.మీ. వర్షపాతం నమోదు
  •  మహబూబాబాద్ జిల్లాలోనూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

హనుమకొండ బస్టాండ్, హనుమకొండ చౌరస్తా, కాజీపేట, హసన్‌పర్తి, గోకుల్ నగర్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాత బీటు బజార్, హంటర్ రోడ్డు, శివనగర్, కరీమాబాద్‌లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు అక్కడి గుడిసెవాసులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సంగెం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా, ఖిల్లా వరంగల్‌లో 14.8, వర్ధన్నపేటలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడినట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. కొత్తగూడ, గంగారం మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పెద్దముప్పారం-దంతాలపల్లి మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద వెళ్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Warangal Floods
Warangal
Hanumakonda
Telangana Rains
Heavy Rainfall
Mahabubabad
Weather Update
Rain Alert
Telangana Floods
Kazipet

More Telugu News