Revanth Reddy: హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలంటూ పిటిషనర్ కు సుప్రీం ఆదేశాలు

Supreme Court Warns Lawyers in Revanth Reddy Case Orders Apology
  • సీఎం రేవంత్ రెడ్డి పాత కేసులో పిటిషనర్, లాయర్లపై సుప్రీంకోర్టు సీరియస్
  • హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర ఆగ్రహం
  • ఆ జడ్జికి బేషరతు క్షమాపణ చెప్పాలని ఆదేశం
  • ముగ్గురిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు
  • న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడటం తమ బాధ్యత అని స్పష్టం చేసిన ధర్మాసనం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత ఆరోపణలు చేసిన ఓ పిటిషనర్‌తో పాటు ఇద్దరు న్యాయవాదులకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేవలం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెబితే సరిపోదని, ఏ న్యాయమూర్తిపై అయితే ఆరోపణలు చేశారో, ఆమెకే నేరుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులపై అవాస్తవ ఆరోపణలు చేసి వారి గౌరవానికి భంగం కలిగించే ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమీ భట్టాచార్య పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఎన్. పెద్దిరాజు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినిపించేందుకు న్యాయమూర్తి కేవలం కొన్ని నిమిషాల సమయమే ఇచ్చారని, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను జులై 29న కొట్టివేసిన సుప్రీంకోర్టు, న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేసినందుకు పిటిషనర్ పెద్దిరాజుతో పాటు ఆయన తరఫు న్యాయవాదులు రితేష్ పాటిల్, నితిన్ మిశ్రాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు విచారణ చేపట్టింది.

నిన్న ఈ కేసు విచారణ సందర్భంగా, తాము అఫిడవిట్ ద్వారా కోర్టుకు క్షమాపణలు చెప్పినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ గవాయ్ "మీరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి క్షమాపణలు కూడా ఆమెకే చెప్పాలి. ఈ మధ్యకాలంలో కొందరు న్యాయవాదుల్లో ట్రయల్, హైకోర్టు న్యాయమూర్తులపై అనుమానాలు వ్యక్తం చేసే ధోరణి పెరిగింది. రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో ఇది మరీ ఎక్కువైంది. దీన్ని అంగీకరించం. హైకోర్టు న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది" అని స్పష్టం చేశారు.

వారంలోగా హైకోర్టులో పిటిషన్‌ను తిరిగి ఓపెన్ చేసి, జస్టిస్ మౌసుమీ భట్టాచార్య ముందు క్షమాపణల అఫిడవిట్‌ను ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. వారి క్షమాపణలను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఆ న్యాయమూర్తే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. హైకోర్టులో ప్రక్రియ ముగిసిన తర్వాతే తాము ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలుపుతూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Revanth Reddy
Telangana High Court
Justice Mousumi Bhattacharya
Supreme Court of India
Defamation case
SC ST Atrocity case
Court contempt
N Peddiraju
Rithesh Patil
Nitin Mishra

More Telugu News