Lakshmi Narasamma: ఆస్తి కోసం కన్నతల్లిపైనే కొడుకు కత్తితో దాడి .. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి

Lakshmi Narasamma Murdered by Son Over Property in Koyyalagudem
  • ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఘటన
  • తల్లి లక్ష్మీనరసమ్మపై కత్తితో దాడి చేసిన కుమారుడు శివాజీ
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 
ఆస్తి కోసం కన్నతల్లిపైనే కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో చోటుచేసుకుంది. కొడుకు చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. 

వివరాల్లోకి వెళితే.. లక్ష్మీనరసమ్మ భర్త పిల్లలు చిన్నప్పుడే చనిపోవడంతో, ఆమె కొయ్యలగూడెంలో రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఏడేళ్ల క్రితం కుమారుడు శివాజీకి వివాహం కాగా, అనంతరం అతడు అత్తగారి ఊరైన ఎల్ఎన్‌డీ పేటకు వెళ్ళిపోయాడు. కుమార్తెకు కూడా వివాహం అయి వెళ్లిపోవడంతో లక్ష్మీనరసమ్మ ఒంటరిగా ఉంటూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం గడుపుతోంది. 

అయితే, శివాజీ కొంతకాలంగా తమకున్న ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి తెచ్చేవాడని మృతురాలి బంధువులు తెలిపారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తల్లీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగి రెండుసార్లు కర్రతో లక్ష్మీనరసమ్మను కొట్టి గాయపరిచాడు. ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వడానికి లక్ష్మీనరసమ్మ అంగీకరించకపోవడంతో ఆదివారం పట్టపగలే అందరూ చూస్తుండగా కత్తితో ఆమెపై దాడి చేశాడు.

తల, మెడతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న ఆమె మృతి చెందింది. 

తల్లిపై కత్తితో దాడి చేసి ఆమె మరణానికి కారణమైన నిందితుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
Lakshmi Narasamma
Eluru district
Koyyalagudem
parricide
property dispute
murder
crime news
Andhra Pradesh
son arrested
domestic violence

More Telugu News