Vemula Prashanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక వెనుక ఈ ముగ్గురి కుట్ర ఉంది: వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy Alleges Political Conspiracy in Kaleshwaram Report
  • కాళేశ్వరం రిపోర్టు ఒక ట్రాష్ అన్న ప్రశాంత్ రెడ్డి
  • దీని వెనుక రేవంత్, చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపణ
  • చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందుకు కాళేశ్వరంపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టులో ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు ఉన్నతాధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ రిపోర్టు ఒక ట్రాష్ అని ఆయన అన్నారు. అది కోర్టుల్లో చెల్లదని చెప్పారు. రిపోర్టు సీల్డ్ కవల్ లో ఉందని.... కానీ, అందులో ఏముందో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ముందే ఎలా చెప్పారని ప్రశ్నించారు. 

పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు వెనుక... రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ కుట్ర ఉందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్టు ఈ ముగ్గురూ వండి వార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు నివేదికలో ఏముందో ముందే ఎలా రాశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 

మేడగడ్డను పండబెట్టి, బనకచర్ల కోసం గోదావరి నీళ్లను గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా ఇచ్చేందుకే కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక బ్యారేజ్ లో రెండు పిల్లర్లు కుంగిపోతే వాటిని బాగుచేసి రైతాంగానికి సాగునీటిని ఇవ్వాల్సింది పోయి... ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, అవినీతి జరిగిందని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

మొన్నటికి మొన్న 5 లక్షల క్యూసెక్కుల వరదను కూడా మేడిగడ్డ బ్యారేజీ తట్టుకుని నిటారుగా నిలబడిందని చెప్పారు. కావాలంటే చూసొద్దాం రావాలంటూ సవాల్ విసిరారు. గోదావరి నదిలో లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు వెళ్లిపోతున్నా వాడుకోకుండా, గుడ్లప్పగించి చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానిది కుటిల బుద్ధి అని మండిపడ్డారు.
Vemula Prashanth Reddy
Kaleshwaram Project
Revanth Reddy
Chandrababu Naidu
Telangana Politics
PC Ghosh Commission
BRS
Irrigation Project
Medigadda Barrage
Telangana Government

More Telugu News