Noida Daycare Center: డే కేర్‌లో పసిపాపపై అరాచకం.. చూస్తూ కూర్చున్న యజమాని!

Noida Daycare Center Child Abuse Case Owner Watched
  • నోయిడాలోని సెక్టార్ 137లో ఉన్న డే కేర్ సెంటర్‌లో ఘటన
  • ఏడుస్తున్న చిన్నారిని కొట్టి, ఎత్తిపడేసి, కొరికి చిత్రహింసలు
  • కుమార్తె శరీరంపై గాయాలు చూసి విస్తుపోయిన తల్లి
  • ప్రశ్నిస్తే బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్‌లో దారుణం జరిగింది. 15 నెలల పసిపాప పట్ల డే కేర్ అటెండెంట్ వికృతంగా ప్రవర్తించింది. ఏడుస్తున్న చిన్నారిని ఊరడించాల్సింది పోయి కొడుతూ, ఈడ్చి పడేస్తూ , విసిరేస్తూ, కొరుకుతూ చిత్రహింసలు పెట్టింది. అక్కడే ఉన్న డే కేర్ యజమాని ఇదంతా చూస్తూ కూర్చుంది తప్పితే జోక్యం చేసుకోలేదు. కుమార్తె శరీరంపై గాయాలను తల్లి గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 పరాస్ టియెర్రాకు చెందిన మోనిక సెక్టార్ 137లో ఉన్న ఈ డే కేర్ సెంటర్‌లో తన 15 నెలల కుమార్తెను వదిలిపెట్టి వెళ్లింది. తిరిగి సాయంత్రం తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు చిన్నారి చలాకీగా లేకపోవడాన్ని గమనించింది. ఇంటికెళ్లి చూస్తే తొడలపై గాయాలు కనిపించాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే అవి పంటిగాట్లని వైద్యుడు నిర్ధారించారు.  

దీంతో వెంటనే ఆమె డే కేర్ సెంటర్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగి తీసుకుంది. అందులోని దృశ్యాలను చూసి నిశ్చేష్టురాలైంది. అందులో డే కేర్ అటెండెంట్ సోనాలి తన కుమార్తెను ఎత్తి కుదేయడం, ఈడ్చివేయడం, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టడం, కొరకడం వంటి దృశ్యాలు కనిపించాయి. 

అవి చూసి విస్తుపోయిన మోనికా డే కేర్ యజమాని చారుతో వాగ్వివాదానికి దిగింది. సోనాలి జోక్యం చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమెను బెదిరించింది. దీంతో మోనికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనాలిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
Noida Daycare Center
Child Abuse
Daycare Abuse
Sonali
Charu
Child Torture
Infant Injury
Paras Tierra
Monica
Sector 137

More Telugu News