DK Parulkar: పాక్ చెర నుంచి తప్పించుకున్న హీరో.. 1971 యుద్ధ వీరుడు డీకే పారుల్కర్ కన్నుమూత

Air Force Group Captain DK Parulkar who led daring escape from Pakistan during 1971 war dies
  • పుణెలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన పారుల్క‌ర్ (82)
  • పాకిస్థాన్ యుద్ధ ఖైదీల శిబిరం నుంచి సాహసోపేతంగా తప్పించుకున్న హీరో
  • 1965 యుద్ధంలోనూ దెబ్బతిన్న విమానాన్ని బేస్‌కు చేర్చిన ధీశాలి
  • వాయు సేన, విశిష్ఠ సేన పతకాల గ్రహీత
1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ చెర నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్న యుద్ధ వీరుడు, భారత వాయుసేన (IAF) మాజీ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ (రిటైర్డ్) కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

"నా తండ్రి 82 సంవత్సరాల వయసులో పూణేలోని మా నివాసంలో ఉదయం గుండెపోటు కారణంగా మరణించారు" అని పారుల్కర్ కుమారుడు ఆదిత్య పరుల్కర్ పీటీఐకి తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

పారుల్కర్ మృతి పట్ల భారత వాయుసేన సంతాపం వ్యక్తం చేసింది. "1971 యుద్ధ హీరో, పాకిస్థాన్ చెర నుంచి సాహసోపేతంగా తప్పించుకుని అసామాన్య ధైర్యసాహసాలు, చాకచక్యం ప్రదర్శించిన గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ స్వర్గస్థులయ్యారు. వాయు యోధులందరి తరఫున ఆయనకు హృదయపూర్వక నివాళులు" అని ఐఏఎఫ్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్)లో పోస్ట్ చేసింది.

1971 యుద్ధంలో వింగ్ కమాండర్‌గా ఉన్న పారుల్కర్, పాకిస్థాన్‌కు యుద్ధ ఖైదీగా చిక్కారు. అక్కడ తన ఇద్దరు సహచరులతో కలిసి ఖైదీల శిబిరం నుంచి తప్పించుకునేందుకు సాహసోపేతమైన ప్రణాళిక రచించి, దానికి నాయకత్వం వహించారు. ఆయన దేశభక్తి, వాయుసేన పట్ల గర్వం అసాధారణమైనవని వాయుసేన కొనియాడింది. ఈ సాహసానికి గాను ఆయనకు విశిష్ఠ సేన పతకం లభించింది.

1965 యుద్ధంలోనూ ఆయన తన ధైర్యాన్ని ప్రదర్శించారు. శత్రువుల కాల్పుల్లో ఆయన విమానం దెబ్బతినడమే కాకుండా, కుడి భుజానికి గాయమైంది. విమానం నుంచి బయటకు దూకేయమని పైలట్ సూచించినా, ఆయన ఏమాత్రం జంకకుండా దెబ్బతిన్న విమానాన్ని సురక్షితంగా బేస్‌కు తీసుకువచ్చారు. ఈ సాహసానికి గాను ఆయనను వాయు సేన పతకంతో సత్కరించారు. 1963 మార్చిలో వాయుసేనలో చేరిన పారుల్కర్, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ సహా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.


DK Parulkar
1971 India Pakistan War
Indian Air Force
IAF
Vishisht Seva Medal
Air Force Medal
Prisoner of War
PoW Escape
Pune
War Hero

More Telugu News