Satish Reddy: నాపై దాడి జరిగితే నారా లోకేశ్, బీటెక్ రవి బాధ్యత వహించాలి: పులివెందుల వైసీపీ నేత సతీశ్ రెడ్డి

Satish Reddy Alleges Threat Nara Lokesh BTech Ravi Responsible for Attack
  • తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న సతీశ్ రెడ్డి
  • దాడి జరిగితే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
  • పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని మండిపాటు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పులివెందుల నేత సతీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరిగే అవకాశం ఉందని... ఈ విషయాన్ని టీడీపీ నేతలే తనతో చెప్పారని ఆయన తెలిపారు. తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పారు. తనపై దాడి జరిగితే దానికి మంత్రి నారా లోకేశ్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. 

తనపై దాడి జరిగితే కోర్టులు సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఇక్కడి పోలీసులతో తనకు న్యాయం జరగదని... తనపై దాడి జరిగితే సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. ఏపీ పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారని విమర్శించారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పులివెందులలో జరుగుతున్న వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని చెప్పారు. టీడీపీ, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోతోందని అన్నారు. 

టీడీపీ వాళ్లే దాడి చేసి, ఆ నెపాన్ని తమపై మోపడం రివాజుగా మారిందని సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల అరాచకాలు తట్టుకోలేక ఉప ఎన్నికను వదిలిపెడతామని అనుకుంటున్నారేమో... తమ పార్టీ మహిళలే ఎన్నికలను ముందుండి నడిపిస్తారని చెప్పారు. 

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను గెలిచి తన తండ్రి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇవ్వాలని నారా లోకేశ్ అనుకుంటున్నారని సతీశ్ రెడ్డి అన్నారు. లోకేశ్ మీరు అనుచితంగా మాట్లాడితే... మేము కూడా అలానే మాట్లాడతామని చెప్పారు. ఈ ఉప ఎన్నిక పులివెందుల పౌరుషానికి, లోకేశ్ రెడ్ బుక్ అహంకారానికి మధ్య పోరు అని అన్నారు.
Satish Reddy
Nara Lokesh
BTech Ravi
Pulivendula
YSRCP
TDP
Andhra Pradesh Politics
ZPTC Election
Political Attack Threat
AP Police

More Telugu News