Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు... కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు

Khalistan Separatists Establish Embassy in Canada
  • కెనడాలోని సర్రేలో 'ఖలిస్థాన్ ఎంబసీ' ఏర్పాటు
  • ఇప్పటికే దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం
  • ఉగ్రవాది నిజ్జర్ ఒకప్పుడు నడిపిన గురుద్వారాలోనే ఈ కార్యాలయం
  • భారత సార్వభౌమత్వానికి ముప్పంటూ భారత హైకమిషన్ తీవ్ర ఆగ్రహం
  • ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే కెనడా ప్రభుత్వం మౌనమంటూ విమర్శలు
భారత్-కెనడా మధ్య ఇప్పటికే బలహీనంగా మారిన ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖలిస్థానీ వేర్పాటువాదులు కెనడాను అడ్డాగా మార్చుకుని భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆందోళనల మధ్య, తాజాగా వారు మరింత బరితెగించారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన సర్రే నగరంలో... ఖలిస్తాన్ ను దేశంగా పేర్కొంటూ 'రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్థాన్ రాయబార కార్యాలయం' పేరుతో ఏకంగా ఎంబసీ ఏర్పాటు చేశారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఒకప్పుడు నాయకత్వం వహించిన గురు నానక్ సిఖ్ గురుద్వారా ప్రాంగణంలోనే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. నిజ్జర్ హత్య ఉదంతంతోనే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అదే ప్రదేశంలో ఖలిస్థాన్ కార్యాలయం ప్రారంభించడం వేర్పాటువాదుల తెగింపును స్పష్టం చేస్తోంది. ఈ కార్యాలయం ఏర్పాటుకు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌ ప్రభుత్వం నుంచి 1.5 లక్షల డాలర్ల నిధులు అందినట్లు ఆరోపణలు రావడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.

ఈ ఘటనపై ఒట్టావాలోని భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇది భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు ప్రత్యక్ష ముప్పు అని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదుల చర్యలను తీవ్రంగా ఖండించిన భారత్, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే, ఈ తీవ్రమైన పరిణామంపై కెనడా ప్రభుత్వం గానీ, బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఏబీ గానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కెనడాలో ఖలిస్థానీ శక్తులు ఇంత స్వేచ్ఛగా వ్యవహరించడానికి అక్కడి ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో సిక్కుల జనాభా 7.7 లక్షలకు పైగా ఉంది. ఈ ఓటు బ్యాంకును ఏ రాజకీయ పార్టీ దూరం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడే చట్టాలను అడ్డం పెట్టుకుని వేర్పాటువాదులు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. భారత్‌లో ఉగ్రవాద-గ్యాంగ్‌స్టర్ల నెట్‌వర్క్‌ను కెనడా నుంచే నడిపిస్తున్నారని ఆధారాలతో సహా నివేదికలు సమర్పించినా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని దౌత్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Khalistan
India Canada relations
Khalistan separatists
Hardeep Singh Nijjar
British Columbia
Guru Nanak Sikh Gurudwara
Indian High Commission Ottawa
Terrorism
Sikh population Canada
David Eby

More Telugu News