Nara Lokesh: బ్రాహ్మణి కట్టిన చీర చూసి 90 మంది కొన్నారు.. ఇదే చేనేత గొప్పతనం!: మంత్రి నారా లోకేశ్

Brahmanis Saree Inspires 90 Purchases Says Minister Nara Lokesh
  • మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేశ్
  • చేనేతల ఆదాయం 30 శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి
  • మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తోందన్న లోకేశ్
  • చేనేత కార్మికులు తనకు కుటుంబ సభ్యుల వంటివారని వ్యాఖ్య
  • స్వర్ణకారులకు సైతం ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం
"నా భార్య బ్రాహ్మణి కట్టుకున్న చేనేత చీర బాగుందని, అది ఎక్కడ కొన్నారని ఆరా తీసి మరీ ఒకే దుకాణంలో 90 మంది కొనుగోలు చేశారు. ఇదే చేనేత కళకు ఉన్న ఆదరణ, దానికున్న శక్తికి నిదర్శనం" అని రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉద్ఘాటించారు. కేవలం ఒక్క చీర ఇంతమందిని ఆకర్షించిందంటే, మంగళగిరి వస్త్రాలకు సరైన ప్రచారం కల్పిస్తే ప్రపంచ మార్కెట్‌ను శాసించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు మంగళగిరిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కళాకారుల నైపుణ్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. తాను ఎవరినైనా కలిసినప్పుడు బహుమతిగా ఇవ్వాల్సి వస్తే, మంగళగిరి చేనేత వస్త్రాలనే అందిస్తానని, తద్వారా వాటి ఖ్యాతిని మరింత పెంచుతానని హామీ ఇచ్చారు.

నేతన్నలు నా కుటుంబ సభ్యులు..
"చేనేత కార్మికులు నాకు ఓటు వేసిన ప్రజలు మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యులు. యువగళం పాదయాత్రలో వారి కష్టాలను కళ్లారా చూశాను. అందుకే వారికి ఇచ్చిన మాట ప్రకారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి ఆదాయం 30 శాతం పెరిగేలా చర్యలు తీసుకున్నాం" అని లోకేశ్ గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో వారిని ఆదుకున్నానని, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి వారి బాగోగులు చూడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. వారు తన దృష్టిలో కార్మికులు కాదని, కళాకారులు అని అభివర్ణించారు. 

ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్
ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. "కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇక్కడి గల్లీలో మీ సేవకుడిగా నేను.. ముగ్గురం కలిసి మంగళగిరి రూపురేఖలు మారుస్తాం" అని భరోసా ఇచ్చారు. చేనేతలతో పాటు నియోజకవర్గంలోని స్వర్ణకారులను కూడా అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత యోధుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని లోకేశ్ పునరుద్ఘాటించారు.
Nara Lokesh
Brahmani Nara
Mangalagiri sarees
handloom sarees
National Handloom Day
AP Handlooms
Chandrababu Naidu
handloom weavers
textile industry
Indian textiles

More Telugu News