MS Dhoni: ఆడినా, ఆడకపోయినా సీఎస్కేతోనే.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

MS Dhoni Makes Big Remark On Future With CSK
  • సీఎస్కేతో తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన ఎంఎస్ ధోనీ
  • ఆట ఆడినా, ఆడకపోయినా పసుపు జెర్సీతోనే ఉంటానని వ్యాఖ్య
  • మరో 15-20 ఏళ్లు సీఎస్కేతోనే నా ప్రయాణమంటూ చమత్కారం
  • ఆడతానని మాత్రం అనుకోవద్దంటూ అభిమానులకు సూచన
  • ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శనపై తొలిసారి స్పందించిన మహీ
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్టార్ ప్లేయ‌ర్‌, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను క్రికెట్ ఆడినా, ఆడకపోయినా ఎప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్‌తోనే తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. అయితే, తాను ఆడతానో లేదో అన్నది వేరే విషయమని పేర్కొంటూ, తన రిటైర్మెంట్‌పై ఉత్కంఠను మాత్రం కొనసాగించాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోనీ మళ్లీ సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈ సీజన్‌లో చెన్నై జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్ ఆద్యంతం ధోనీ రిటైర్మెంట్‌పై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన భవిష్యత్తుపై అడిగిన ప్రశ్నకు మ‌హీ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.

"నా భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. కానీ మీరు పసుపు జెర్సీలో తిరిగి రావడం గురించి అడిగితే, నేను ఎప్పుడూ పసుపు జెర్సీలోనే ఉంటాను. నేను ఆడతానా? లేదా? అన్నది వేరే సంగతి" అని ధోనీ స్పష్టం చేశాడు. అభిమానుల హర్షధ్వానాల మధ్య, "నేను, సీఎస్కే రాబోయే 15-20 ఏళ్ల పాటు కలిసే ఉంటాం. అయితే అన్ని సంవత్సరాలు నేను ఆడతానని మాత్రం వాళ్లు అనుకోవద్దని ఆశిస్తున్నా" అంటూ చమత్కరించాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ, తన సారథ్యంలో జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించాడు. చెన్నై జట్టుతో, నగరంతో తనకున్న బంధం గురించి ఆయన మాట్లాడుతూ, "గడిచిన కొన్నేళ్లుగా ఈ బంధం మరింత బలపడింది. ఒక వ్యక్తిగా, ఒక క్రికెటర్‌గా ఎదగడానికి ఇది నాకు ఎంతగానో సహాయపడింది. సీఎస్కే నాకు మంచి చేసింది, చెన్నైకి కూడా మంచి చేసింది" అని వివరించాడు.

గత రెండు సీజన్లుగా జట్టు ప్రదర్శనపై కూడా ధోని స్పందించాడు. "గత రెండు సీజన్లుగా మా ప్రదర్శన బాగాలేదు. మేము మా స్థాయికి తగ్గట్టు ఆడలేదు. అయితే, జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. గత ఏడాది కూడా మా ముందు ఇదే ప్రశ్న తలెత్తింది" అని ఎంఎస్‌డీ విశ్లేషించాడు. ధోనీ తాజా వ్యాఖ్యలతో మైదానంలో అతని ఆట ముగిసినా, సీఎస్కేతో బంధం మాత్రం కొనసాగుతుందని స్పష్టమైంది.


MS Dhoni
Dhoni
Chennai Super Kings
CSK
IPL
Indian Premier League
Ruturaj Gaikwad
Cricket
Dhoni Retirement
MSD

More Telugu News