Donald Trump: రష్యా యుద్ధం ఆపితే భారత్ పై టారిఫ్ లు తగ్గొచ్చు: ట్రంప్

Donald Trump Says India Tariffs Could Drop if Russia Ends War
  • ప్రస్తుతం మాత్రం పన్నులు చెల్లించాల్సిందేనన్న అమెరికా అధ్యక్షుడు
  • యుద్ధ విరమణకు రష్యాకు విధించిన గడువు శుక్రవారంతో ముగింపు
  • తాజా చర్చల్లో కీలక పురోగతి కనిపించిందని ట్రంప్ వెల్లడి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ పై తొలుత 25 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్.. తాజాగా మరో 25 శాతం అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం వెలువరించారు.

ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలంటూ రష్యాకు ట్రంప్ విధించిన గడువు కూడా రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల్లో కీలక పురోగతి సాధించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే రష్యా యుద్ధం ఆపేస్తే భారత్ పై పన్నుల భారం తగ్గిస్తారా? అంటూ ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ ను ప్రశ్నించారు.

ట్రంప్ జవాబిస్తూ.. ‘రష్యా యుద్ధం ఆపేస్తే భారత్ పై పన్నులు తగ్గుతాయా అంటే చెప్పలేం. బహుశా తగ్గొచ్చు. కానీ ఇప్పుడే చెప్పలేను. యుద్ధ విరమణకు సంబంధించిన చర్చల్లో పురోగతి సాధించడానికి భారత్ పై విధించిన అదనపు సుంకాలు కూడా కారణం కావొచ్చు. అందువల్ల టారిఫ్ లు తగ్గే అవకాశం ఉంది’ అని వివరించారు. అయితే, ప్రస్తుతం భారత్ పై 25 శాతం సుంకాలు అమలులోకి వచ్చాయని, ఈ నెల 27 నుంచి అదనపు సుంకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ పన్నులు చెల్లించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.
Donald Trump
Russia Ukraine war
India tariffs
US India trade
Vladimir Putin
Steve Witkoff
India Russia relations
US tariffs on India
Ukraine war impact
Trade agreements

More Telugu News