Petrol Bunk: హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంకు కొంప ముంచింది!

Petrol Bunk Sealed for Violating No Helmet Rule in Indore
  • మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ లో అమలులో ఉన్న నో హెల్మెట్ .. నో పెట్రోల్ నిబంధన
  • హెల్మెట్ బదులు తలపై పాల క్యాన్ మూత పెట్టుకున్న పాల వ్యాపారి
  • ఇది గమనించకుండా బంక్‌లో బైక్ కు పెట్రోల్ కొట్టిన నిర్వాహకుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • నిబంధన ఉల్లంఘించినందుకు పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసిన అధికారులు
హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు అనే నిబంధన ఓ పెట్రోల్ బంక్ యజమానికి షాక్ ఇచ్చింది. సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా పెట్రోల్ బంక్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఇందౌర్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి 'హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు'
అనే నిబంధన అమలులో ఉంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వస్తే వారికి పెట్రోల్ పోయవద్దని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత బంక్‌లపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు ఇదివరకే హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా లేదా రెండూ ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ క్రమంలో స్థానికంగా ఓ పాల విక్రేత తన బైక్‌పై పెట్రోల్ కోసం బంక్‌కు వచ్చాడు. అయితే, అతని వద్ద హెల్మెట్ లేకపోవడంతో పాల క్యాన్ మూతను తీసి తలపై పెట్టుకున్నాడు. బంక్‌లో పని చేసే వ్యక్తి ఏమీ పట్టించుకోకుండా పెట్రోల్ పోశాడు. అదే సమయంలో అక్కడ ఉన్న యువకుడు ఒకరు హెల్మెట్ బదులుగా తలపై పాల క్యాన్ మూత పెట్టుకుని పెట్రోల్ పోయించుకుంటున్న వైనాన్ని తన సెల్ ఫోన్‌లో రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి నెటిజన్లు రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియో సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. 
Petrol Bunk
No Helmet No Petrol
Indore
Madhya Pradesh
Traffic Rules
Viral Video
Petrol Pump Sealed
Helmet Rule Violation

More Telugu News