Mohammed Siraj: సిరాజ్‌పై ఒవైసీ 'హైదరాబాదీ' ప్రశంస.. పేసర్ రిప్లై ఇదే!

Mohammed Siraj Responds To Asaduddin Owaisis Poora Khol Diye Pasha Compliment After England Heroics
  • ఇంగ్లండ్‌పై అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌పై ఒవైసీ ప్రశంసలు
  • 'పూరా ఖోల్ దియే పాషా' అంటూ హైదరాబాదీ యాసలో కితాబు
  • ఒవైసీ ట్వీట్‌కు వినమ్రంగా బదులిచ్చిన మహమ్మద్ సిరాజ్
  • సిరీస్‌లో 23 వికెట్లతో టాప్ బౌలర్‌గా నిలిచిన హైదరాబాదీ పేసర్
  • చివరి టెస్ట్‌లో 5 వికెట్లతో 'ప్లేయ‌ర్‌ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో ఒవైసీ తనదైన హైదరాబాదీ యాసలో అభినందనలు తెలిపారు. దీనికి సిరాజ్ కూడా అంతే వినమ్రంగా స్పందించడం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లండ్‌తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 5 వికెట్ల ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ ప్రదర్శనకు గాను సిరాజ్‌కు 'ప్లేయ‌ర్‌ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా లభించింది.

ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ 'ఎక్స్‌' (ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను అభినందించారు. "ఎల్లప్పుడూ విజేతవే సిరాజ్. మ‌నం హైదరాబాదీలో చెప్పినట్లు 'పూరా ఖోల్ దియే పాషా!'" అని పోస్ట్ చేశారు. స్థానిక యాసలో 'పూరా ఖోల్ దియే పాషా' అంటే ప్రత్యర్థులను పూర్తిగా కట్టడి చేసి అద్భుతంగా ఆడావని అర్థం.

ఒవైసీ ప్రశంసకు సిరాజ్ హృదయపూర్వకంగా స్పందించాడు. "థ్యాంక్యూ సో మచ్ సర్. మీరు ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు" అంటూ వినమ్రంగా బదులిచ్చాడు. స్థానిక గల్లీ క్రికెట్ నుంచి జాతీయ జట్టు స్టార్‌గా ఎదిగిన సిరాజ్‌ను ఒవైసీ పలు సందర్భాల్లో బహిరంగంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌కు గర్వకారణంగా నిలుస్తున్నాడని కొనియాడారు. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ మొయీన్ అలీ సైతం సిరాజ్‌ను ప్రశంసిస్తూ.. అతని పట్టుదల, దూకుడైన బౌలింగ్ ఏ బ్యాటర్‌కైనా కఠిన సవాల్ అని పేర్కొన్నారు. ఇక‌, ఈ తాజా సంభాషణ క్రీడాస్ఫూర్తిని చాటుతూ, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రముఖుల మధ్య ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది.


Mohammed Siraj
Siraj
Asaduddin Owaisi
Hyderabad
Indian Cricket
India vs England
Test Series
Cricket
Moeen Ali
Pace Bowler

More Telugu News