Rajitha: పెద్ద మనసుతో మానసిక రోగిని పెళ్లాడిన లేడీ సైకాలజిస్ట్... కానీ..!

Rajitha Lady Psychologist Commits Suicide After Marrying Mental Patient
  • మానసిక రుగ్మతతో బాధపడుతున్న రోహిత్‌ను వివాహం చేసుకున్న మానసిక వైద్యురాలు రజిత
  • వివాహం అయితే రోహిత్ మానసిక రుగ్మత నుంచి బయటపడతాడనుకున్న రజిత
  • భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రజిత
ఓ మానసిక రోగి జీవితాన్ని బాగు చేయాలనుకున్న మానసిక వైద్యురాలి (సైక్రియాటిస్ట్) ప్లాన్ బెడిసికొట్టి, చివరికి తనే మానసిక ఆందోళనకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఇది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జరిగింది. మానసిక వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో నివాసం ఉండే సబ్ ఇన్స్‌పెక్టర్ నర్సింహగౌడ్ కుమార్తె రజిత సైకాలజీ చదువు పూర్తి కాగానే బంజారాహిల్స్‌లోని ఓ మానసిక చికిత్సాలయంలో ఉద్యోగిగా చేరింది. అక్కడే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. ఈ క్రమంలో అక్కడ మానసిక వ్యాధితో బాధపడుతున్న రోహిత్ పరిచయమయ్యాడు. కేపీహెచ్‌బీకి చెందిన రోహిత్ గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశాడు.

రజితతో పరిచయం ఏర్పడిన తర్వాత రోహిత్ ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అతనిని మానసిక రుగ్మత నుంచి బయటపడేయాలన్న ఉద్దేశంతో రోహిత్ ప్రేమను రజిత అంగీకరించింది. ఇద్దరూ తమ ప్రేమను పెద్దలకు తెలియజేయడంతో వివాహానికి ఇరు కుటుంబాలు సమ్మతించాయి. దీంతో వారి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయితే రోహిత్ మారుతాడని, మానసిక రుగ్మత నుంచి బయటపడతాడని భావించిన ఆమె ఆశలు అడియాసలయ్యాయి.

భార్య సంపాదనతో రోహిత్ జల్సాలు చేయడం ప్రారంభించాడు. చెడు అలవాట్లు మానుకోవాలని అనేకసార్లు చెప్పినా అతనిలో మార్పు రాలేదు. దీనికి తోడు రోహిత్ తల్లిదండ్రులు కిష్టయ్య, సరేషతో పాటు సోదరుడు మోహిత్ కూడా అతనికే వత్తాసుగా ఉండి రజితను వేధించారు. భర్త, అత్తమామలు, మరిది పెట్టే బాధలు భరించలేక రజిత ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.

జూలై 16న ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ తర్వాత కూడా ఆమె సమస్యలు వెంటాడుతూ ఉండటంతో మరింత కుంగిపోయిన రజిత జులై 28న మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది.

బాత్‌రూమ్ కిటికీ నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, తలకు తీవ్రమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్, అతని కుటుంబ సభ్యులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 
Rajitha
Lady Psychologist
Hyderabad
Suicide
Mental Health
Rohit
Software Engineer
SR Nagar Police
Harassment
Family Issues

More Telugu News