Iberia Airlines: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. పొగతో నిండిపోయిన క్యాబిన్.. ప్రయాణికుల్లో ఆందోళన.. వీడియో ఇదిగో!

Iberia Airlines Flight Returns After Bird Strike Fills Cabin with Smoke
  • ఐబేరియా విమానం పారిస్ వెళ్తుండగా ఘటన
  • బయలుదేరిన 20 నిమిషాలకే మళ్లీ వెనక్కి
  • కుదుపులతో, పెద్ద శబ్దాలతో భయపెట్టిన విమానం
  • సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఆనందంతో ప్రయాణికుల చప్పట్లు
పారిస్ వెళ్తున్న ఒక విమానం ముక్కు భాగాన్ని పక్షి ఢీకొనడంతో క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం విమానం బయలుదేరిన 20 నిమిషాలకే వెనక్కి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్‌టీ. కామ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో ఒక ప్రయాణికుడు ఆక్సిజన్ మాస్క్‌ పట్టుకుని భయపడుతుండటం కనిపిస్తుంది.

ఆదివారం జరిగిందీ ఘటన. ఐబేరియా విమానం ఐబీ-579 మాడ్రిడ్‌లోని అడోల్ఫో సువారెజ్ మాడ్రిడ్-బారాజాస్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన 20 నిమిషాలకే ఒక పెద్ద పక్షి విమానం ముక్కు భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

విమానంలో ఉన్న ప్రయాణికుడు జియాన్‌కార్లో సాండోవల్ ఈ భయానక దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మొదట అది సాధారణ గాలి దుమారం అనుకున్నాం, కానీ తర్వాత భయానక శబ్దాలు వినిపించడం మొదలైంది. ఏదో జరిగిందని మాకు అర్థమైంది" అని ఆయన పేర్కొన్నారు.

వీడియోలో విమానం కుదుపులకు లోనవడం, వింత శబ్దాలు రావడం, క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోవడం కనిపించింది. ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఒక శిశువు ఏడుపు కూడా వినిపించింది. అయితే, విమానం సురక్షితంగా మాడ్రిడ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు చప్పట్లు కొట్టి ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది నెటిజన్లు స్పందించారు. కేవలం ఒక పక్షి విమానాన్ని ఇంతగా దెబ్బతీయడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ ‘విమానాలు ఒకప్పుడు స్కైస్క్రాపర్లను కూల్చాయి, ఇప్పుడు ఒక పక్షిని కూడా తట్టుకోలేకపోతున్నాయి’ అని కామెంట్ చేశారు. 
Iberia Airlines
Iberia flight IB-579
bird strike
Madrid airport
flight emergency landing
plane accident
flight safety
Adolfo Suarez Madrid-Barajas Airport
Giancarlo Sandoval

More Telugu News