Coffee: మహిళలూ.. రాత్రిపూట కాఫీ తాగుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే!

Caffeine at Night Increases Impulsive Behavior in Women Study
  • రాత్రి కాఫీతో పెరిగే తొందరపాటు ప్రవర్తన
  • పురుషుల కన్నా మహిళలపైనే ఎక్కువ ప్రభావం
  • టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
  • పండ్ల ఈగలపై చేసిన ప్రయోగాలతో గుర్తింపు
  • రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారికి హెచ్చరిక
రాత్రిపూట చురుకుగా ఉండేందుకు కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే మీలో, ముఖ్యంగా మహిళల్లో ముందు వెనుక ఆలోచించని తొందరపాటు ప్రవర్తన పెరిగే ప్రమాదం ఉందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. రాత్రివేళ కెఫీన్ తీసుకోవడం వల్ల ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే తత్వం పెరుగుతుందని, ఈ ప్రభావం పురుషులతో పోలిస్తే మహిళల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 

అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి (యూటీఈపీ) చెందిన పరిశోధకులు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ ఎరిక్ సాల్డెస్, పాల్ సబండాల్, క్యుంగ్-ఆన్ హాన్ నేతృత్వంలోని బృందం చేసిన ఈ పరిశోధన వివరాలు 'ఐసైన్స్' అనే ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సైకోయాక్టివ్ పదార్థం కెఫీన్ కాబట్టి, దాని ప్రభావాలపై లోతైన అవగాహన అవసరమని పరిశోధకులు తెలిపారు.

ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు పండ్ల ఈగలను (డ్రోసోఫిలా మెలనోగాస్టర్) ఉపయోగించారు. మానవుల నాడీ వ్యవస్థ, జన్యువులకు, పండ్ల ఈగలకు మధ్య చాలా పోలికలు ఉండటంతో ఇలాంటి అధ్యయనాలకు వీటిని వినియోగిస్తారు. రాత్రివేళ పండ్ల ఈగల ఆహారంలో కెఫీన్‌ను కలిపి, వాటి ప్రవర్తనలో మార్పులను గమనించారు. ప్రతికూల పరిస్థితుల్లో అవి తమ కదలికలను ఎంతవరకు నియంత్రించుకోగలుగుతున్నాయో పరిశీలించారు.

రాత్రిపూట కెఫీన్ తీసుకున్న ఈగల్లో తొందరపాటు ప్రవర్తన గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా శరీరంలో కెఫీన్ స్థాయులు ఒకేలా ఉన్నప్పటికీ, మగ ఈగలతో పోలిస్తే ఆడ ఈగల్లో ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. ఈ ఫలితాలు మనుషులకు కూడా వర్తించే అవకాశం ఉందని, రాత్రివేళ కాఫీ తాగడం వల్ల తొందరపాటు, ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది, సైనికులు వంటి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కెఫీన్ ప్రభావం మహిళల్లో ఎక్కువగా ఉన్నందున, రాత్రివేళ మెలకువగా ఉండేందుకు కాఫీపై ఆధారపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది.
Coffee
Caffeine
Women
Night coffee
Impulsive behavior
Sleep
Health
Research
UTEP
Eric Saldes

More Telugu News