ఉత్తరకాశీలో విషాదం.. సోషల్ మీడియాలో హృదయ విదారక దృశ్యాలు.. వీడియో ఇదిగో!
- ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలు
- నలుగురి మృతి.. 11 మంది సైనికుల గల్లంతు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
ధారాలి, సుఖీ టాప్ ప్రాంతాలలో సంభవించిన రెండు మేఘ విస్ఫోటనాల వల్ల పెను విధ్వంసం జరిగింది. ముఖ్యంగా ధారాలి గ్రామం తీవ్రంగా దెబ్బతింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఈ ప్రాంతం అతలాకుతలమైంది. మంగళవారం మధ్యాహ్నం వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ధారాలి గ్రామం దాదాపు సగం వరకు ధ్వంసమైందని పీటీఐ నివేదించింది. ధారాలి గ్రామం గంగోత్రికి వెళ్లే మార్గంలో ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇప్పటివరకు ఈ ఘటనలో నలుగురు మరణించినట్టు నిర్ధారించారు. 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
గల్లంతైన వారిని గుర్తించడానికి, సహాయక చర్యల కోసం భారత సైన్యం ఎంఐ-17, చినూక్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 130 మందిని రక్షించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.