Kamal Haasan: కమల హాసన్ సినిమాలు బాయ్‌కాట్ చేయాలని బీజేపీ పిలుపు.. కారణం ఇదే!

BJP Calls for Boycott of Kamal Haasan Movies Over Sanatana Dharma Remarks
  • ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై కమల్ వ్యాఖ్యలు
  • సనాతన ధర్మాన్ని కమల్ నాశనం చేయాలనుకుంటున్నారని బీజేపీ ఫైర్
  • ఆయన సినిమాలను ఓటీటీలోనూ హిందువులు చూడొద్దని పిలుపు
  • కమల్ అలా మాట్లాడాల్సింది కాదన్న ఖుష్బూ
సనాతన ధర్మంపై సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల హాసన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన సినిమాలను బహిష్కరించాలని తమిళనాడు బీజేపీ ప్రజలకు పిలుపునిచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్‌రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. "గతంలో ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. వారికి మనం బుద్ధి చెబుదాం" అని ఆయన అన్నారు.

"హిందువులు ఎవరూ కమల్ సినిమాలను చూడవద్దని, ఓటీటీలోనూ చూడవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఇలా చేస్తే వారు బహిరంగ వేదికల మీద ఇలాంటి బాధ్యతారహితమైన, లక్షలాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు" అని ఆయన పేర్కొన్నారు.

కమల్ ఏమన్నారంటే..
నటుడు సూర్య నడుపుతున్న 'అగరం ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ "విద్యకు మాత్రమే దేశాన్ని మార్చే శక్తి ఉంది. నియంతృత్వం, సనాతన ధర్మపు సంకెళ్లను తెంచగల ఏకైక ఆయుధం విద్య మాత్రమే" అని అన్నారు. అలాగే, ఈ సందర్భంగా ‘నీట్’ను ప్రస్తావించారు. వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయి పరీక్ష సమాజంలోని అణగారిన వర్గాల విద్యార్థులకు ఒక అడ్డంకిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కమల్‌తో గతంలో కలిసి నటించిన ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ.. "విద్య గురించి మాట్లాడే ఒక కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని తీసుకురావడం పూర్తిగా అసందర్భం. విద్య ప్రాముఖ్యత గురించి మాత్రమే కమల్ చెప్పి ఉండాల్సింది" అని ఆమె అభిప్రాయపడ్డారు. డీఎంకే ప్రతినిధి ఎ. శరవణన్ మాట్లాడుతూ "కమల హాసన్ సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించారు. ఆయనపై ఎలా స్పందించాలో తెలియక రైట్‌వింగ్ ఆగ్రహంతో ఉంది. ఆయన వ్యాఖ్యల ప్రాముఖ్యత వారికి తెలుసు" అని అన్నారు. 
Kamal Haasan
BJP
Boycott
Sanatana Dharma
Tamil Nadu
Udhayanidhi Stalin
Khushbu Sundar
NEET Exam
Agaram Foundation

More Telugu News