Jr NTR: 'వార్ 2' అందుకే ఒప్పుకున్నా.. అసలు కారణం చెప్పిన ఎన్టీఆర్

Jr NTR reveals reason for choosing War 2
  • బాలీవుడ్ ఎంట్రీపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
  • 'వార్ 2' సినిమా స్క్రిప్ట్ త‌న‌ను బాగా ఆక‌ర్షించింద‌న్న తార‌క్‌
  • ఆ కార‌ణంతోనే తాను ఈ మూవీని అంగీక‌రించిన‌ట్లు వెల్ల‌డి
  • ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు సినిమా
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం 'వార్ 2' గురించి ఎట్టకేలకు స్పందించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 14న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌ 'ఎస్క్వైర్‌ ఇండియా' తాజాగా ఎడిష‌న్ క‌వ‌ర్‌పేజీపై తార‌క్ ఫొటోను ముద్రించింది. ఆ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఒక నటుడిగా తనను తాను సవాల్ చేసుకునే పాత్రలో నటించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు అంగీకరించినట్లు ఎన్టీఆర్ వివరించారు. అందుకు 'వార్ 2' స్క్రిప్ట్ క‌రెక్ట్‌గా అనిపించింద‌ని తెలిపారు. బ‌ల‌మైన క‌థ‌తో ఇది రూపొందిన‌ట్లు తార‌క్ చెప్పారు. "భారతీయ ప్రేక్షకులకు ఏదైనా కొత్త అనుభూతిని పంచే పాత్రతో హిందీలో అడుగుపెట్టాలనుకున్నాను. 'వార్ 2'లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. 

ఇక‌, ఈ సినిమాలో భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేశారు. ఇక‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్, కోలీవుడ్ అనేవి వుండవు. మన‌మంతా ఒక్క‌టే ఇండ‌స్ట్రీ. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌గా గుర్తించాలి. ఇదే విష‌యాన్ని గ‌తంలో రాజ‌మౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చూపించాలంతే" అని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

అలాగే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ పోషిస్తున్న 'కబీర్' పాత్రకు దీటైన శక్తిగా తన పాత్రను తీర్చిదిద్దారని, ఇది కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా మానసిక సంఘర్షణతో కూడి ఉంటుందని తెలిపారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని తార‌క్ వెల్ల‌డించారు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ 'విక్రమ్' అనే శక్తిమంతమైన స్పెషల్ ఫోర్సెస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ఇక‌, త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై కూడా ఇంట‌ర్వ్యూలో ఎన్‌టీఆర్ మాట్లాడారు. త‌న అర్ధాంగి ప్ర‌ణ‌తి కోసం, స్నేహితుల కోసం వంట చేయ‌డం త‌న‌కెంతో ఇష్ట‌మని తెలిపారు. తాను పునుగులు బాగా వేస్తాన‌ని, తాను వండే బిర్యానీ కూడా త‌న‌కు బాగా న‌చ్చుతుంద‌న్నారు. జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకోన‌ని, వ‌చ్చిన అవ‌కాశాల‌ను నిజాయ‌తీగా వినియోగించుకుంటాన‌ని చెప్పారు.   
Jr NTR
NTR
War 2
Hrithik Roshan
Bollywood debut
Koratala Siva
Devara
Indian Film Industry
Vikram
Esquire India

More Telugu News