Chandrababu Naidu: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ

Chandrababu Naidu AP Cabinet Meeting Today Key Discussions
  • సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం, కొత్త రేషన్ కార్డుల జారీకి పచ్చజెండా ఊపనున్న కేబినెట్ 
ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.

ఈ భేటీలో ప్రధానంగా ఎంతో కాలంగా రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆమోదం తెలుపనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేశారు.

అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు జీరో టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్‌ జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించబోతున్నారు. మొత్తం బస్సుల్లో 74 శాతం బస్సులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ ప్రెస్, మెట్రో ఎక్స్‌ ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఇప్పటికే రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డుల జారీ, నూతన బార్ పాలసీ అంశంపైనా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త అక్రిడిటేషన్, జర్నలిస్ట్‌ల సమస్యలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని, కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి నిన్న మీడియాకు తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఇటీవల సింగపూర్ లో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన విషయాలను మంత్రివర్గంలో సీఎం పంచుకోనున్నారు. ఇక, కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలు, భారీ ఎత్తున నగదు బయట పడడం, అరెస్ట్‌లకు సంబంధించి కూడా చర్చించనున్నారు. 
Chandrababu Naidu
AP Cabinet Meeting
Andhra Pradesh
Free Bus Travel Scheme
Women Free Bus
Ration Cards
Journalist Accreditation
Singapore Tour
Mandipli Ramprasad Reddy
Kolusu Parthasarathy

More Telugu News