చంద్రబాబుపై గౌరవంతో సింగపూర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది: ఏపీ మంత్రి నారాయణ
- సింగపూర్ సంస్థల కన్సార్షియం ఒప్పందాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్న మంత్రి నారాయణ
- సింగపూర్ సంస్థలను సీఐడీ అధికారులతో వేధించిందన్న మంత్రి
- సీఎం చంద్రబాబు చొరవతో సింగపూర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వివరణ
- సాంకేతిక సహకారం అందిస్తామన్నారని వెల్లడి
ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రి నారాయణ నిన్న విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణాలపై 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం సింగపూర్ సంస్థల కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా సీఐడీ అధికారులను సింగపూర్ పంపి, ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకున్న సంస్థలను విచారణ పేరుతో వేధించిందని మండిపడ్డారు. సీఐడీ అధికారుల విచారణతో సింగపూర్ ప్రభుత్వం తీవ్ర వేదనకు గురయిందని తెలిపారు.
అయితే, సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య స్నేహపూర్వక బంధం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్లి అధ్యక్షుడిని, సీనియర్ మంత్రులను కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబుపై గౌరవంతో వారు ఎంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రానికి కావాల్సిన మద్దతు అందిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి నారాయణ వివరించారు.