Bigg Boss: బిగ్‌బాస్ షో పేరుతో మోసం.. వైద్యుడికి రూ.10 లక్షల టోకరా

Bigg Boss Fraud Doctor Duped of 10 Lakhs
  • మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘటన
  • ‘బ్యాక్‌డోర్’ పద్ధతిలో అవకాశం కల్పిస్తానని వైద్యుడి నుంచి డబ్బులు వసూలు
  • ఆ తర్వాతి నుంచి పత్తా లేకుండా పోయిన నిందితుడు
  • పోలీసులకు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
‘బిగ్‌బాస్’రియాలిటీ షోలో అవకాశం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి భోపాల్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అభినిత్ గుప్తాను నిండా ముంచేశాడో వ్యక్తి. అతడి నుంచి ఏకంగా రూ. 10 లక్షలు వసూలు చేశాడు. వైద్యుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. 

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో డాక్టర్ అభినిత్ గుప్తా ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’ నిర్వహిస్తున్నారు. 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి డాక్టర్‌ను సంప్రదించాడు. తాను ఒక ఈవెంట్ డైరెక్టర్‌నని, టీవీ నిర్మాణ సంస్థలతో తనకు బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. బిగ్‌బాస్ షోలో ప్రవేశం కల్పిస్తానని డాక్టర్ గుప్తాకు హామీ ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన డాక్టర్ గుప్తా రూ. 10 లక్షలు చెల్లించాడు. 

 మోసం బయటపడిందిలా...
బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా విడుదల కాగా, అందులో డాక్టర్ గుప్తా పేరు లేదు. దీంతో ఆయన కరణ్ సింగ్‌ను నిలదీశారు. ‘బ్యాక్‌డోర్ పద్ధతి’ద్వారా అవకాశం వస్తుందని చెప్పి కరణ్ తప్పించుకున్నాడు. కానీ రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో డాక్టర్ గుప్తా తన డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశాడు.

ఆ తర్వాతి నుంచి డాక్టర్ గుప్తా ఫోన్ కాల్స్‌ను కరణ్ ఎత్తడం మానేశాడు. అనంతరం ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో డాక్టర్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Bigg Boss
Abhinit Gupta
Bigg Boss scam
reality show
Bhopal doctor
Karan Singh
fraud
skin clinic
event director
television

More Telugu News