Air India: మరోసారి వార్తల్లోకి ఎయిరిండియా.. ఈసారి విమానంలో బొద్దింకలు

Air India flight infested with cockroaches on San Francisco to Mumbai route
  • శాన్‌ప్రాన్సిస్కో - ముంబై విమానంలో బొద్దింకలు
  • వివరణ ఇచ్చిన ఎయిరిండియా విమానయాన సంస్థ
  • సిబ్బంది వెంటనే స్పందించిందని ఎయిరిండియా ప్రతినిధి వెల్లడి
ఎయిరిండియా విమానం ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, శాన్‌ఫ్రాన్సిస్కో - ముంబై విమానంలో ప్రయాణికులు బొద్దింకల కారణంగా ఇబ్బందికి గురయ్యారు. విమానంలో బొద్దింకలు రావడంతో విమానయాన సంస్థ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై బయలుదేరిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని, చిన్న బొద్దింకల కారణంగా వారు ఇబ్బందిపడ్డారని ఎయిరిండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. సిబ్బంది వెంటనే స్పందించి అదే క్యాబిన్‌లో వేరేచోట వారికి సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కోల్‌కతాలో ఇంధనం కోసం ల్యాండ్ అయిన సమయంలో బొద్దింకలు ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసినట్లు తెలిపారు.

నిర్వహణపరంగా అంతా సక్రమంగా ఉన్నప్పటికీ, గ్రౌండ్ ఆపరేషన్స్ సమయంలో ఈ కీటకాలు ఒక్కోసారి విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని ఎయిరిండియా ప్రతినిధి ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం సాయంత్రం కోల్‌కతా బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే బెంగళూరుకు మళ్లించారు. మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని సంస్థ వెల్లడించింది.
Air India
Air India cockroaches
San Francisco Mumbai flight
cockroaches in flight
flight disruptions

More Telugu News