Viral Video: పోలీస్‌ అధికారి ఇంట్లోకి వరద నీరు.. పాలు, పూలతో పూజ చేసిన యూపీ పోలీస్!

Floodwaters come calling UP cop performs Ganga aarti at doorstep
  • ఇంట్లోకి చేరిన వరద నీటికి పూజలు చేసిన యూపీ సబ్-ఇన్‌స్పెక్టర్
  • గంగా మాతే తనను ఆశీర్వదించడానికి వచ్చిందని వ్యాఖ్య
  • పాలు, పూలతో వరదకు హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల ఉగ్రరూపంతో భారీ వరదలు
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే, ఓ పోలీస్ అధికారి మాత్రం తన ఇంట్లోకి వచ్చిన వరద నీటిని సాక్షాత్తూ గంగా మాతగా భావించి పూజలు చేశారు. ఆయన భక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గంగా, యమునా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్‌లోని దారాగంజ్ ప్రాంతానికి చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ చంద్రదీప్ నిషాద్ ఇంట్లోకి కూడా వరద నీరు వచ్చేసింది. అయితే, దీనికి ఆయన ఆందోళన చెందలేదు. పైగా తన ఇంటి గుమ్మం వద్ద నిలబడి వరద నీటికి భక్తితో పూజలు నిర్వహించారు.

"జై గంగా మయ్యా కీ... నన్ను ఆశీర్వదించడానికి నా ఇంటికే వచ్చావు. నేను ధన్యుడినయ్యాను" అంటూ మంత్రాలు పఠిస్తూ పాలు పోసి, గులాబీ రేకులను చల్లారు. వరద నీటిలో మునిగి, గంగమ్మకు నమస్కరించారు. అంతేకాకుండా నడుము లోతు నీరున్న తన ఇంట్లోనే ఈత కొడుతూ 'జై గంగా మయ్యా' అని నినదించారు. ఈ దృశ్యాలను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. హైకోర్టు జడ్జికి పీఎస్ఓగా పనిచేస్తున్న నిషాద్ జాతీయ స్థాయి స్విమ్మర్ కావడం గమనార్హం.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది ఆయన భక్తిని ప్రశంసిస్తూ, కష్టాన్ని కూడా సానుకూలంగా స్వీకరించారని అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం వరద నివారణ చర్యల్లో విఫలమవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తున్నారు. ఇదిలాఉంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ 'టీమ్-11'ను ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Viral Video
Chandradeep Nishad
Prayagraj
Uttar Pradesh floods
Ganga river
Yamuna river
flood worship
police officer
national swimmer
Team 11
Yogi Adityanath

More Telugu News